top of page

వనదేవత..! మన దేవత..! జన దేవత..!

Writer: Writer Desk
Writer Desk
Jan 30
2 min read


వెదురు కర్రలే దైవాలుగా… గద్దెలే గర్భగుడులుగా…


కోట్లాది హృదయాలను ఏకం చేస్తున్న మేడారం సమ్మక్క–సారలమ్మ మహా జాతర..!


మేడారం : వెదురు కర్రలే దైవాలుగా, గద్దెలే గర్భగుడులుగా, పసుపు–కుంకుమలే వజ్రాభరణాలుగా, బెల్లమే నిలువెత్తు బంగారంగా, ఒడిబియ్యమే పరమాన్నంగా, చీర ముక్క–రైక బట్టలే సారెలుగా మారి తల్లులకు సమర్పించే అపూర్వ ఆధ్యాత్మిక మహోత్సవం — మేడారం సమ్మక్క–సారలమ్మ మహా జాతర భక్తి పారవశ్యంతో అట్టహాసంగా కొనసాగుతోంది.


వన దేవత..!

మన దేవత..!

జన దేవత..!


అపార విశ్వాసంతో కోట్లాది భక్తుల హృదయాలను ఏకం చేసే ఈ ప్రపంచ ప్రసిద్ధి గాంచిన జాతరకు దేశం నలుమూలలతో పాటు వివిధ రాష్ట్రాల నుంచి లక్షలాది భక్తజనం మేడారానికి తరలివస్తున్నారు.


భక్తులతో కిక్కిరిసిన జాతర ప్రాంగణం


జాతర ప్రాంగణం మొత్తం భక్తులతో కిటకిటలాడుతోంది. ఎటు చూసినా భక్తులే దర్శనమిస్తున్నారు. క్రమబద్ధంగా ఏర్పాటు చేసిన క్యూ లైన్లలో భక్తుల బారులు దర్శనానికి ఎదురుచూస్తుండగా, ప్రశాంత వాతావరణంలో తల్లుల దర్శనాలు సజావుగా కొనసాగుతున్నాయి. భారీ రద్దీని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం, జిల్లా యంత్రాంగం, పోలీస్ శాఖ సమన్వయంతో ముందస్తు చర్యలు చేపట్టాయి. ట్రాఫిక్ నియంత్రణ, క్యూ లైన్ నిర్వహణ, భక్తుల భద్రతపై ప్రత్యేక దృష్టి సారించారు. జంపన్న వాగులో పుణ్యస్నానాలతో భక్తుల సందడి నెలకొనగా, గద్దెల వద్ద భక్తులు భక్తి పారవశ్యంలో మునిగిపోయారు.



వైద్య బృందాలు, వాలంటీర్లు అప్రమత్తం..!

జాతర ప్రాంగణం అంతటా వైద్య బృందాలు అప్రమత్తంగా సేవలందిస్తుండగా, క్యూ లైన్ల వద్ద వాలంటీర్లు నిరంతరం భక్తులకు సహకారం అందిస్తున్నారు. భక్తుల రద్దీని తట్టుకునేలా అవసరమైన అన్ని ఏర్పాట్లు సమర్థంగా కొనసాగుతున్నాయి.


వన దేవతల సేవలో ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు..!


మేడారం మహా జాతరకు వరంగల్ కాకతీయ విశ్వవిద్యాలయం నుంచి సుమారు ఐదు వందల మంది ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు వలందిస్తున్నారు.! సమ్మక్క–సారలమ్మ గద్దెల వద్ద, క్యూ లైన్లలో భక్తులకు సహాయం చేయడం, జంపన్న వాగు వద్ద సూచనలు ఇవ్వడం, తప్పిపోయిన భక్తులను శిబిరాలకు చేర్చడం వంటి సేవలతో వాలంటీర్లు జాతరలో కీలక పాత్ర పోషిస్తున్నారు.



ప్రముఖుల దర్శనాలు..!


ఈ సందర్భంగా పలువురు ప్రముఖులు శ్రీ సమ్మక్క–సారలమ్మ తల్లులను దర్శించుకుని మొక్కులు సమర్పించారు.


• తెలంగాణ రాష్ట్ర గవర్నర్ శ్రీ జిష్ణు దేవ్ వర్మ – నిలువెత్తు బంగారం సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు.


• తెలంగాణ రాష్ట్ర డీజీపీ శ్రీ శివధర్ రెడ్డి తల్లులను దర్శించుకున్నారు


• మాజీ గవర్నర్ శ్రీ బండారు దత్తాత్రేయ అమ్మవార్లను దర్శించుకున్నారు .


• మంత్రి శ్రీమతి సీతక్క, రాష్ట్ర అటవీ, పర్యావరణ, దేవాదాయ శాఖ మంత్రి శ్రీమతి కొండా సురేఖ, మహబూబాబాద్ ఎంపీ శ్రీ పోరిక బలరాం నాయక్, ఎమ్మెల్సీ శ్రీ బసవరాజు సారయ్య, ఎమ్మెల్యే శ్రీ నాయిని రాజేందర్ రెడ్డి, శ్రీ పాయం వెంకటేశ్వర్లు, శ్రీ గండ్ర సత్యనారాయణ అమ్మవార్లను దర్శించి మొక్కులు తీర్చుకున్నారు.


• బ్రిటిష్ డిప్యూటీ హై కమిషన్ గ్యారత్ వెన్ ఓవెన్ సమ్మక్క–సారలమ్మలకు తులాభారం సమర్పించి తల్లులను దర్శించుకున్నారు


సౌకర్యాలపై సంతృప్తి వ్యక్తం చేసిన భక్తులు..!

ప్రభుత్వం కల్పించిన సౌకర్యాలపై భక్తులు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. గత జాతరలతో పోలిస్తే ఈసారి దర్శనాలు మరింత సులభంగా, వేగంగా జరుగుతున్నాయని, భద్రత, పారిశుద్ధ్యం, వైద్య సేవలు మెరుగ్గా ఉన్నాయని భక్తులు ప్రశంసిస్తున్నారు.


భక్తి, నమ్మకం, సంప్రదాయం, సంస్కృతి సమ్మేళనంగా ప్రభుత్వం నిర్వహిస్తున్న మేడారం జాతర వైభవోపేతంగా కొనసాగుతోంది..!




•••••

Comments


© Copyrights Reserved 2026 By NewSense News | Designed & Developed by Panchayithi.com 

bottom of page