top of page

ప్రమాదమా... కుట్ర ఉందా..?

  • Writer: Writer Desk
    Writer Desk
  • 7 days ago
  • 3 min read

మరాఠా రాజకీయాల్లో ఉద్దండుడిగా పేరున్న అజిత్ పవార్ ఆకస్మికంగా కన్నుమూశారు... స్థానిక ఎన్నికల.ప్రచారంలో భాగంగా సొంత నియోజక వర్గం భారామతి లో ప్రచారం కోసం ముంబై నుండి విమానంలో బయలుదేరిన ఆయన విమానం గమ్యస్థానం వద్ద ల్యాండ్ అవడానికి వస్తున్న సమయంలో సాంకేతిక సమస్యతో ప్రమాదానికి గురైంది.. మంటలు చెలరేగి క్షణాల్లోనే విమానం మొత్తం వ్యాపించడంతో.. ఆ ధాటికి రెండు ముక్కలుగా పేలిపోయి పడిపోయింది..!

ప్రమాద సమయంలో అజిత్ తో పాటు ఆయన పీఏ, గన్ మెన్, ఇద్దరు పైలట్లు విమానంలో ఉన్నారు. వారంతా ప్రమాదంలో చనిపోయినట్లుగా డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) అధికారికంగా ప్రకటించింది.. ప్రమాదానికి గురైన విమాన వివరాలు కూడా వెల్లడించింది..


వీఎస్ఆర్ ఎయిర్ క్రాఫ్ట్ కు చెందిన లియర్ జెట్ - 45 ఎక్స్ఆర్ ఎనిమిది సీట్లు కలిగి ఉండే విమానంలో అజిత్ పవార్ తన సెక్యూరిటీ సిబ్బంది, వ్యక్తిగత సహాయకుడితో కలిసి ఉదయం 8.10 గంటల సమయంలో భారామతి వెళ్లేందుకు బయలుదేరారు..


భారామతి చేరుకున్న సమయంలో ల్యాండ్ అవుతుండగా...సరిగా ఉదయం 8.45 గంటలకు ప్రమాదం జరిగినట్లుగా అధికారులు చెబుతున్నారు..


ఏటిసికి మాత్రం 9.10 గంటల సమయంలో విమానం ప్రమాదానికి గురైనట్లుగా సమాచారం అందినట్లు తెలుస్తోంది.! ప్రమాదానికి ముందు ఏటిసి తో సంబంధాలు తెగిపోయినట్లుగా తెలుస్తోంది.! ప్రమాదానికి గల కచ్చితమైన కారణాలు తెలియడానికి చాలా సమయం పట్టే అవకాశముంది..!


అయితే ఆయన మహారాష్ట్ర తో పాటు దేశంలోని ప్రధాన రాజకీయ నాయకులలో ఎదుగుతున్న అజిత్ పవార్ మరణంపై అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి.


విమాన ప్రమాదంపై కుట్ర కోణంలో కూడా దర్యాప్తు చేయాలని ఆయన అభిమానులు పార్టీ కార్యకర్తలు డిమాండ్ చేస్తున్నారు..


రెండేళ్ల క్రితం ఎన్సీపీ నుండి విడిపోయి సొంత వర్గంతో అజిత్ వర్గం ఎన్సీపీని ఏర్పాటు చేసుకుని గత మహారాష్ట్ర ఎన్నికలలో అదే పార్టీపై పోటీచేసి గణనీయమైన సీట్లు సాధించి ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో ఆయన ఉప ముఖ్యమంత్రి పదవి చేపట్టారు. రాజకీయంగా గత నాలుగేళ్లుగా మహారాష్ట్రలో చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో ఆయన విమానం ప్రమాదానికి గురికావడం.. సహజంగానే అనేక అనుమానాలకు తావిస్తోంది..


ఈ నేపథ్యంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ ప్రమాదంపై ఎలాంటి విచారణకు ఆదేశిస్తాయనేది ఆసక్తి కారంగా మారింది..



పెదనాన్న శరద్ పవార్ స్పూర్తితో..!

అజిత్ పవార్ తన పెద్ద నాన్న శరద్ పవార్ స్పూర్తితో ఆయన అడుగుజాడల్లోనే రాజకీయాల్లో ప్రవేశించారు.. మొదట1982లో చక్కెర సహకార బోర్డు సభ్యుడిగా నియమితుడయ్యాడు. తర్వాత 1991లో పుణె జిల్లా కోఆపరేటివ్ బ్యాంకు ఛైర్మన్‌గా ఎన్నికయ్యాడు. ఆ తర్వాత ప్రత్యక్ష రాజకీయాల బరిలోకి దిగాడు. 1991లో బారామతి లోక్‌సభ స్థానం నుండి తొలిసారిగా పోటీ చేసి మంచి మెజారిటీతో ఎంపీగా ఎన్నికయ్యాడు.అదే ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బారామతి నియోజకవర్గం నుండి తొలిసారి పోటీ చేసి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు. తనను ఆదరించి అక్కున చేర్చుకున్న భారామతిని ఆయన చివరి వరకు వదులుకోలేదు. ప్రతీ అసెంబ్లీ ఎన్నికలలో అదే స్థానం నుండి పోటీ చేసి విజయం సాధిస్తున్నారు. ఇదే పరంపరలో ఏడవసారి ఎమ్మెల్యేగా ఎన్నికైన ఆయన రికార్డు సృష్టించాడు. అంతే కాకుండా సొంత వర్గంతో పార్టీని ఏర్పాటు చేసుకుని విజయం సాధించి ఉప ముఖ్యమంత్రి పదవిని చేపట్టి సమర్థవంతమైన నాయకుడిగా మహారాష్ట్ర రాజకీయాల్లో ప్రత్యేక స్థానం ఏర్పరుచుకున్నారు..


అజిత్ మొదట సుధాకర్‌రావు నాయక్‌ ప్రభుత్వంలో సహాయ మంత్రిగా తొలిసారి భాద్యతలు చేపట్టి ఆ తరువాత శరద్‌ పవార్‌ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సహాయ మంత్రిగా పలు విభాగాల బాధ్యతలు నిర్వర్తించారు. ఇక 1999 లో శరద్‌ పవార్‌ కాంగ్రెస్‌ పార్టీతో విభేదించి మహారాష్ట్ర కేంద్రంగా నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్‌సీపీ) ని స్థాపించినప్పుడు పెదనాన్న వెంట నడిచాడు అజిత్..! అదే ఏడాది మహారాష్ట్రలో జరిగిన ఎన్నికలలో హంగ్‌ అసెంబ్లీ ఏర్పడిన పరిస్థితిలో కాంగ్రెస్‌ తో ఎన్‌సిపి పొత్తు పెట్టుకోగా విలాస్‌రావు దేశ్‌ముఖ్‌ ముఖ్యమంత్రి అయ్యారు..పొత్తు ఒప్పందంలో భాగంగా ఎన్సీపీ తరపున నీటిపారుదల శాఖ మంత్రిగా అజిత్ బాధ్యతలు చేపట్టాడు. ఆ తరువాత అశోక్‌ చవాన్‌, సుశీల్‌ కుమార్‌ షిండే, పృథ్వీరాజ్ చవాన్ మంత్రివర్గంలో మంత్రిగా. ఉపముఖ్యమంత్రిగా అజిత్ భాద్యతలు నిర్వర్తించారు..


మొత్తం మీద ఒక్కసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీలో తొలి అడుగు పెట్టిన అజిత్ ఆతర్వాత వెనుదిరిగి చూడలేదు.. ఓటమి ఎరుగని నేతగా ప్రత్యేక గుర్తింపు సాధించి..చివరి క్షణం వరకు ఆయన అసెంబ్లీతో అనుబంధం కొనసాగించాడు..!



పెదనాన్నతో విభేదాలతో సొంత కుంపటి..!

మహారాష్ట్ర రాజకీయాల్లో గత కొన్నేళ్లుగా అనేక మార్పులు చోటుచేసుకున్నాయి... కాంగ్రెస్ శివసేన బీజేపీ ఎన్సీపీల మధ్య నాలుగు స్తంభాలాట పదిరిగా రాజకీయం కొనసాగింది..


కాంగ్రెస్ తో ఎన్సీపీ సుదీర్ఘ కాలం స్నేహం కొనసాగిస్తూ వస్తోంది.. అదే మాదిరిగా శివసేన, బీజేపీ ల మధ్య స్నేహం కొనసాగింది.. అయితే బీజేపీ శివసేన మధ్య తలెత్తిన విబేధాలు మహారాష్ట్ర రాజకీయాలను పూర్తిగా మలుపు తిప్పాయి.. ప్రత్యర్థులు మిత్రులుగా.. మిత్రులు ప్రత్యర్థులుగా మారిపోయారు. ఉద్దావ్ ఠాక్రే శివసేనను చావు దెబ్బ తీసిన బీజేపీ.. ఆ పార్టీలోని కీలక నాయకుడు సుశీల్ కుమార్ షిండే తో పార్టీలో చీలిక తెచ్చింది.. మెజారిటీ ఎమ్మెల్యేలు సుశీల్ షిండే తో బయటకు వచ్చి బీజేపీ.తో జత కట్టారు.. దీంతో కాంగ్రెస్ మద్దతుతో కొనసాగిన ఉద్దావ్ ఠాక్రే ప్రభుత్వం కూలిపోగా చీలిక వర్గానికి నాయకత్వం వహించిన సుశీల్ షిండే.. బీజేపీ మద్దతుతో అధికార పీఠం అధిష్టించారు..


గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ తో స్నేహాన్ని వీడి బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమిలో చేరుదామని అజిత్ పవార్ ప్రతిపాదించగా... అందుకు శరద్ పవార్ అంగీకరించలేదు... దీంతో ఆయనతో విభేదించిన అజిత్ సొంతగా అజిత్ వర్గం ఎన్సీపీ పేరుతో వేరు కుంపటి ఏర్పాటు చేసుకుని మహారాష్ట్ర ఎన్నికలలో 41 సీట్లు సాధించారు.. మహాయుతి పేరుతో ఏర్పాటు చేసిన ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో చేరి ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు..!



కుటుంబం..!

1959 జూలై 22 న జన్మించిన అజిత్ పవార్ 1985 లో సునేత్రా పాటిల్ ను వివాహం చేసుకున్నారు.. వీరికి ఇద్దరు కుమారులు ఉన్నారు. ముంబై చర్చ్ గేట్ ప్రీమౌంట్ లో నివాసం..


ప్రస్తుతం అజిత్ సతీమణి సునేత్రా పాటిల్ రాజ్యసభ సభ్యురాలిగా కొనసాగుతున్నారు..


రాజకీయంగా పెదనాన్న శరద్ పవార్ తో విబేధించినప్పటికీ.. కుటుంబపరంగా ఎలాంటి ప్రభావం చూపించకుండా జాగ్రత్త పడ్డారు.. పెదనాన్నకు మునుపటి మాదిరిగానే అత్యంత గౌరవంగా చూసేవారని సన్నిహితులు కుటుంబసభ్యులు చెబుతున్నారు..!


......


A Report By

ShyamaSundar Akula

9010746999

••••

Comments


© Copyrights Reserved 2024 By NewSense News | Designed & Developed by Panchayithi.com 

bottom of page