
కొత్త లవ్ స్టోరీ.! ఆయన ఏక్ నాథ్ షిండేనా..!
- Writer Desk

- 2 hours ago
- 3 min read
తమిళనాడు రాజకీయాల్లో కాస్త అనిశ్చితి..!
విజయం సాధించినప్పటికీ మ్యాజిక్ ఫిగర్ ను చేరుకోవడంలో విఫలమైన విజయ్ టీవీకే పార్టీ..!
°°°°°°°°°°°
సుదీర్ఘ స్నేహానికి బీటలు.! కాంగ్రెస్ రాజకీయాలపై డీఎంకే ఆగ్రహం.! నమ్మకద్రోహం చేశారనే అసంతృప్తి..! విజయ్ తో దోస్తీ కట్టిన కాంగ్రెస్.. స్టాలిన్ తో సుదీర్ఘ బంధాన్ని తెంచుకుంది..! జాతీయ రాజకీయాల్లో ఇది ప్రభావం చూపనుంది..!
°°°°°°°°°°°°
ఎంజీఆర్ స్థాపించిన పార్టీ.. జయలలిత నేతృత్వంలో వెలుగువెలిగిన పార్టీ.. జనాకర్షక నేత లేక దీనావస్థకు చేరుకున్న పార్టీ..! చీలిక దిశగా పరిణామాలు..!
°°°°°°°°°°°°°
తమిళనాడు రాజకీయ పరిస్థితిపై న్యూ - సెన్స్ విశ్లేషణాత్మక కథనం..!
ప్రస్తుతం విజయ్ పార్టీకి ఉన్న సీట్లు 108..! అయితే ఇందులో ఒకటి మైనస్ అవుతుంది..! రెండు చోట్ల విజయ్ గెలిచాడు కాబట్టి తిరుచిరాపల్లి ఈస్ట్ సీట్ ను వదులుకోనున్న విజయ్..! దీంతో ఆ పార్టీకి సాంకేతికంగా ఉన్న సీట్ల సంఖ్య 107..!
మరో 11 సీట్లు కావాలి మ్యాజిక్ ఫిగర్ సాధించాలంటే..!
కాంగ్రెస్ మద్దతు ఇచ్చినా కూడా మరో ఆరు సీట్లు అవసరమవుతాయి..! డీఎంకే 59. అన్నా డీఎంకే 47.. కాంగ్రెస్ 5.. పీఎంకే 4.. ఐయుఎం 2.. సీపీఐ 2.. స్థానాలు గెలుచుకున్నాయి..!
ఇపుడు విజయ్ కాంగ్రెస్ సహా పీఎంకే.. ఐయుఎం.. సిపిఐ మద్దతు తీసుకుంటే 13 సీట్లు వస్తాయి..!
అంటే మొత్తంగా టీవీకే కూటమి బలం 120కి చేరుకుంటుంది..!
రాజకీయంగా భవిష్యత్తు పరిణామాలు ఎలా ఉంటాయో తెలియదు..! విజయ్ కు ఈ బలం సరిపోక పోవచ్చు..! ఇపుడు ఆయన దృష్టి అన్నాడీఎంకే పై పడిందని తెలుస్తోంది..! ఆదిలోనే పార్టీ ఫిరాయింపులు ప్రోత్సహించడం వల్ల తీవ్రస్థాయిలో విమర్శలు వెల్లువెత్తడం ఖాయం..! అదే భయం విజయ్ ను వెంటాడుతుంది..! అలా అని కేవలం 120 సీట్ల ఐదేళ్లు నెట్టుకురావడం అంత సులువు కాదు..! ఏంచేయాలో అర్థంకాని స్థితికి విజయ్ ఉన్నట్లు తెలుస్తోంది..! డీఎంకే తో రాష్ట్రస్థాయిలోనే కాదు జాతీయ స్థాయిలో కూడా కాంగ్రెస్ కు సుదీర్ఘ అనునంబంధం ఉంది..! ఒక సందర్భంలో గత ముఖ్యమంత్రి. డీఎంకే పార్టీ అధినేత స్టాలిన్ ఒక విషయాన్ని చెప్పారు..! తన తండ్రి.. మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి ఒక మాట చెప్పారని.. ఎన్ని అడ్డంకులు ఇబ్బందులు ఎదురైనా.. కాంగ్రెస్ పార్టీతో స్నేహాన్ని వదులుకోకూడదని స్పష్టంగా తనకు చెప్పారని.. జాతీయ స్థాయిలో తమ పార్టీ ప్రయాణం కాంగ్రెస్ తోనే ఉంటుందని ఆయన ప్రకటించారు.. అయితే ప్రస్తుతం నెలకొన్న అనూహ్య పరిణామాలు ఈ రెండు పార్టీల మధ్య చిచ్చు తెచ్చిపెట్టాయి..!

స్టాలిన్ పార్టీని వదులుకుని విజయ్ తో చెట్టాపట్టాల్..!
విజయ్ పార్టీకి మద్దతు ఇవ్వాలని జాతీయ కాంగ్రెస్ నేతలు తీసుకున్న నిర్ణయాన్ని స్టాలిన్ వ్యతిరేకిస్తున్నారు..! పార్టీని ఎన్నికల బరిలో నిలిపేముందు విజయ్ డీఎంకే తమ ప్రధాన ప్రత్యర్థి అని ప్రకటించారు..! ఎన్నికలలో టీవీకే వల్ల డీఎంకే ఓటమి పాలయింది..! డీఎంకే ను ఓడించడమే కాకుండా అధికారంలోకి కూడా వస్తోంది..! దీంతో డీఎంకే టీవీకే పార్టీల మధ్య బద్ద వైరం నెలకొంది..! ఈ పరిస్థితుల్లో తమను కాదని కాంగ్రెస్ పార్టీ విజయ్ తో స్నేహం చేయడానికి ఆసక్తి చూపడంపై స్టాలిన్ మండిపడుతున్నారు..! కాంగ్రెస్ పార్టీకి సంక్షోభ సమయంలో మద్దతుగా నిలిచిన తమను కష్టాల్లో ఉన్న సమయంలో వదిలించుకునే ప్రయత్నం చేయడాన్ని స్టాలిన్ జీర్ణించుకోలేకపోతున్నారు.. ఈ పరిణామం..జాతీయ స్థాయిలో కాంగ్రెస్ నేతృత్వంలో కొనసాగుతున్న ఇండియా కూటమిపై ప్రభావం చూపే అవకాశముందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది..!

ఇండియా కూటమిలో బలంగా ఉన్న టీఎంసీ డీఎంకే ఇపుడు బలహీనపరిపోయాయి..! అక్కడ మమతా బెనర్జీ.. ఇక్కడ స్టాలిన్ అధికారం కోల్పోయారు..! మరో రెండున్నరేళ్లలో రాబోయే సార్వత్రిక ఎన్నికల వరకు ఈ పార్టీలు పుంజుకుంటాయా లేదా అన్నది చూడాల్సి ఉంటుంది..!
ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ పార్టీ కూడా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది..! తమిళనాడు లో రాబోయే ఐదేళ్లు విజయ్ అధికారంలో ఉంటారు..! కేవలం ఏడాదిన్నర కాలంలోనే ఆయన పార్టీ తమిళ ప్రజల ఆదరణ సాధించి అధికారాన్ని చేజిక్కించుకుంది..! సార్వత్రిక ఎన్నికల సమయంలో విజయ్ పార్టీనే అధికారంలో ఉంటుంది కాబట్టి ఆయనతో జతకట్టడమే మేలనే అభిప్రాయంలో కాంగ్రెస్ పెద్దలు ఉన్నట్లు తెలుస్తోంది..!

ప్రస్తుతం స్టాలిన్ తమపై ఆగ్రహంగా ఉన్నప్పటికీ తర్వాత ఆయనను బుజ్జగించి ఒప్పించవచ్చని.. ఆయన కాంగ్రెస్ ను వదిలి ఎలాగు వెళ్ళలేరు కాబట్టి పెద్దగా ప్రమాదం ఉండదని.. అదే సమయంలో విజయ్ బీజేపీ వైపు మొగ్గు చూపకుండా జాగ్రత్తపడాల్సిన అవసరం ఉందని.. ఆయనను కూడా ఇండియా కూటమిలో భాగస్వామ్యం చేస్తే ఇక తమకు సౌత్ లో తిరుగు ఉండదనే అంచనాలో ఆ పార్టీ పెద్దలు ఉన్నట్లు డిల్లీలో ప్రచారం సాగుతోంది. !
ఏది ఏమైనా ఇపుడు విజయ్ ను చేజారకుండా చూసుకోవాలని కాంగ్రెస్ దృడ నిశ్చయంతో ఉన్నట్లు గత రెండు రోజుల పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి..!
షణ్ముగం మరో ఏక్ నాథ్ షిండే..!
ఈ ఎన్నికలలో మూడవ స్థానానికి పడిపోయిన అన్నాడీఎంకే పార్టీ పరిస్థితి నానాటికి తీసుకట్టులా మారిపోతోంది..! ఆ పార్టీకి బలమైన చరిష్మా కలిగిన నాయకుడు లేకపోవడం పెద్దలోటుగా పరిణమించింది..! జయలలిత మరణం తర్వాత అనేక రాజకీయ ఒడిదుడుకులు ఎదుర్కున్న ఆ పార్టీకి రాష్ట్రస్థాయిలో ప్రభావం చూపగల పెద్దదిక్కు ఎవరూ లేరు..! ఒకపక్క కొత్తగా వచ్చిన విజయ్.. మరోపక్క స్టాలిన్.. వాళ్ళ జనాకర్షణ బలం ముందు పళనీస్వామి నిలబడలేని పరిస్థితి..!
ఈ ఎన్నికలలో 47 సీట్లు సాధించినప్పటికీ బలమైన నాయకత్వం లేకపోవడం వల్ల గెలిచిన ఎమ్మెల్యేలను కాపాడుకోలేని పరిస్థితిలో ఉంది..! ఇక అన్నా డీఎంకే కు పెద్దగా భవిష్యత్తు ఉండదని భావిస్తున్న ఎమ్మెల్యేలు ఎపుడెపుడు పార్టీని విడుదామా అన్న ఆలోచనలో ఉన్నారు. ఇపుడు విజయ్ పార్టీకి ఇది అనుకోని అదృష్టంలా కలిసి వస్తోంది..!

అన్నాడీఎంకేలో కాస్తబలమైన నాయకుడిగా ఉన్న షణ్ముగం.. విజయ్ పార్టీకి మద్దతుగా నిలుద్దామని ప్రతిపాదించినప్పటికీ.. పార్టీ ఒప్పుకోలేదు.. దీంతో ఆయన తనకు అనుకూలంగా ఉండే ఎమ్మెల్యేలను కూడగట్టి పార్టీని చీల్చే ఆలోచనలో ఉన్నట్లు నిన్నటినుండి జోరుగా చర్చ జరుగుతోంది..! షణ్ముగం వైపు ఎక్కువమంది ఎమ్మెల్యేలు ఉండడంతో పిరాయింపుల సమస్యకూడా ఉండదు..! ప్రస్తుతం రాష్ట్రంలో ఆయన కదిలకలపై అందరి దృష్టి కొనసాగుతోంది..! 47 మంది కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేల్లో 35 వరకు ఎమ్మెల్యేలు షణ్ముగం వైపు ఉన్నట్లు తెలుస్తోంది..! తమిళనాడు రాజకీయాల్లో షణ్ముగం మరో ఏక్ నాథ్ షిండే కాబోతున్నారనే ప్రచారం జోరుగా సాగుతోంది..!
చూడాలి రేపు విజయ్ ప్రమాణ స్వీకారం.. అన్నాడీఎంకే లో పరిస్థితులు ఏ మలుపు తీసుకుంటాయో..!
•••••••••••
A Report By
ShyamaSundar Akula
9010746999
•••••••••••




Comments