కాక్రోచ్ స్పూర్తితో అన్నామలై..!
- Writer Desk

- 1 day ago
- 2 min read
తమిళనాడు రాజకీయ సంచలనం అన్నామలై కొత్త ఉద్యమం చేపట్టబోతున్నాడా..!
బీజేపీ నుండి ఆయన బయటకు వస్తారా..!
తమిళనాడులో ఇపుడిదే హాట్ టాపిక్..!
దేశవ్యాప్తంగా పెను సంచలనం రేపిన కాక్రోచ్ జనతా పార్టీ స్పూర్తితో అన్నామలై ఈ ఉద్యమానికి శ్రీకారం చుట్టబోతున్నారనే చర్చ సాగుతోంది..!
మక్కల్ శక్తి ఇయక్కం పేరుతో ఉద్యమం చేపట్టాలని అన్నామలై నిర్ణయించినట్లుగా ఆయన అభిమానులు చెబుతున్నారు..!
పార్టీకి ఎంతో సేవ చేసి రాష్ట్రంలో ఒక ఊపు తీసుకొచ్చిన అన్నామలైని బీజేపీ పెద్దలు కావాలని పక్కన బెట్టారని.. ఆయనకు పార్టీలో తీవ్ర అన్యాయం జరిగిందని.. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఇక ఆ పార్టీతో తెగదెంపులు చేసుకుని బయటకి రావడం ఖాయమనే నిర్ణయానికి వచ్చారని..అదే సమయంలో దేశవ్యాప్తంగా కెరటంలా దూసుకువచ్చిన కాక్రోచ్ పార్టీ ఆయనలో కొత్త ఉత్సాహాన్ని నింపిందని అభిమానులు చెబుతున్నారు..!
యువత మార్పు కోరుకుంటోందని తమిళనాట విజయ్ నిరూపించారని అన్నామలై భావిస్తున్నట్లు చెబుతున్నారు..! అలాగే కొత్త జనరేషన్ ( జెన్ జీ) కూడా దేశవ్యాప్తంగా అదే కోరుకుంటున్నట్లు కాక్రోచ్ పొలిటికల్ పార్టీ నిరూపించిందని.. ఎలాంటి నిర్మాణం లేకుండానే కేవలం సోషల్ మీడియా పబ్లిసిటీతో దేశవ్యాప్తంగా కాక్రోచ్ పార్టీకి వచ్చిన విపరీతమైన ఆదరణ ఆషామాషీ విషయం కాదని.. కొత్త జనరేషన్ ఆలోచనలకు అనుగుణంగా ఒక నూతన ఉద్యమాన్ని నిర్మించి ముందుకు సాగితే తప్పకుండా లక్ష్యం సాధించవచ్చని అన్నామలై ఆలోచన చేస్తున్నట్లుగా అభిమానులు చెబుతున్నారు..!

ముందు నాన్ పొలిటికల్ ..!
ప్రస్తుతం బీజేపీ పార్టీలో ఉన్న అన్నామలై ఈ ఉద్యమాన్ని నాన్ పొలిటికల్ వేదికగా నడిపించాలని భావిస్తున్నట్లు తెలిసింది..! ఇప్పటికిప్పుడు పార్టీ నుండి బయటకు వెళ్ళే ఆలోచనలో లేనప్పటికీ.. ఆరు నెలల తర్వాత ఒక కచ్చితమైన నిర్ణయం తీసుకోవచ్చని తమిళనాడుకు చెందిన రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు..!
బీజేపీ నాయకులు శ్రేణులు మాత్రం.. అన్నామలై చేపట్టే కొత్త ఉద్యమం ప్రధాని మోదీ స్ఫూర్తితో ఉండబోతుందని చెబుతున్నారు..! అయితే పన్నెండేళ్లుగా దేశంలో అధికారంలో ఉన్న బీజేపీ స్పూర్తితో ఎలా ప్రజలను ప్రభావితం చేస్తారని.. ఇది ముమ్మాటికీ దేశంలో పాలకులకు వ్యతిరేకంగానే ఉండబోతుందని అంటున్నారు.. అయితే ఇక్కడ అన్నామలై తీసుకునే కాన్సెప్ట్ ను బట్టి వ్యతిరేకమా.. అనుకూలమా తేలుతుందని.. ఒకవేళ మతపరమైన.. ఆధ్యాత్మిక పరమైనది అయితే మాత్రం అప్పుడు ఏ పార్టీకి నష్టం అనేది అంచనావేయవచ్చనేది మరో వాదన..!
రాష్ట్ర స్థాయికి పరిమితమా.. దేశవ్యాప్తమా..?
రాష్ట్ర స్థాయికి పరిమితమయ్యే ఉద్యమమా..లేదంటే దేశవ్యాప్తంగా విస్తరించే యోచనలో అన్నామలై ఉన్నారా అనే విషయంలో కూడా స్పష్టత లేదు..!
రాష్ట్రానికి మాత్రమే పరిమితమైతే.. రాష్ట్రంలో ఉన్న సమస్యలకు అనుగుణంగా.. ప్రజా అవసరాలకు ప్రయోజనాలకు అనుకూలంగా ఉద్యమ సిద్ధాంతాలు రూపొందించాల్సి ఉంటుంది..!
అలా కాకుండా దేశవ్యాప్త ఉద్యమంగా చేపట్టాలంటే..దేశంలో ఉన్న సమస్యలు పాలకుల వైఫల్యాలు.. అవినీతి బంధుప్రీతి వంటి ప్రధాన సమస్యలే ఎజెండాగా తీసుకోవాల్సి ఉంటుంది..! ఇవన్నీ కాకుండా ఇంకేదైనా కొత్త అంశం ఎజెండాతో ముందుకు వస్తే అది ఎలా ఉంటుంది అనేది ఇప్పుడే చెప్పలేమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి..!
ఆయన ఏది చేసినా సంచలనమే..!
తమిళనాడుకు చెందిన అన్నామలై సరిగ్గా పదిహేనేళ్ల క్రితం కర్ణాటక క్యాడర్ ఐపీఎస్ గా ఎంపికై.. పోలీస్ అధికారిగా కర్ణాటకలో ఉద్యోగం నిర్వహిస్తూ ఎనిమిదేళ్ల తర్వాత 2019లో ఉద్యోగాన్ని స్వచ్ఛంద విరమణతో వదిలేసి 2020లో బీజేపీతో రాజకీయ ప్రస్థానం మొదలుపెట్టిన అన్నామలై అనతికాలంలోనే తమిళనాడు ప్రజల ఆధరణ సాధించారు.. యువతను చైతన్యపరిచే ప్రసంగాలు.. వాగ్ధాటి తో తమిళనాడు సహా సౌత్ రాష్ట్రాల్లో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు..!
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా తమిళనాట పార్టీకి ఒక ఊపు తీసుకువచ్చిన అన్నామలై.. తర్వాత ప్రతికూల.పరిస్థితులు ఎదుర్కున్నారు.. అధ్యక్ష పదవిని వేరేవాళ్లకు కట్టబెట్టిన బీజేపీ అధిష్టానం అన్నామలైకి ప్రాధాన్యత తగ్గించింది..! అంతేకాదు మొన్నటి అసెంబ్లీ ఎన్నికలలో అసలు టికెట్ కూడా ఇవ్వలేదు.. దీంతో అతన్ని బయటికి పంపించడానికి పొగ బెడుతున్నారనే అభిప్రాయం వినిపించింది రాష్ట్రంలో..!
తాజా పరిణామాలు బీజేపీ పెద్దలను ఆందోళనకు గురిచేస్తున్నట్లు తెలుస్తోంది.. అన్నామలై వెళ్ళిపోతే బీజేపీకి రాష్ట్రంలో నష్టమేనని.. అన్నామలై స్థాయిలో ప్రజలను ఆకర్షించే శక్తిగల నాయకుడు రాష్ట్ర పార్టీలో మరెవరూ లేరనే అభిప్రాయం రాజకీయ విశ్లేషకులనుండి వ్యక్తమవుతోంది..!
••••••••••••
A Report By
ShyamaSundar Akula
9010746999
••••••••••••




Comments