
అక్కడ కారు..! ఇక్కడ కంగారు..!!
- Writer Desk

- 1 day ago
- 2 min read
మొన్నటిదాకా కాంగ్రెస్ లో అలజడి రేపిన జగిత్యాల పాలిటిక్స్ ఇపుడు గులాబీ పార్టీ టర్న్ తీసుకున్నాయా..?
తాజా పరిణామాలతో గులాబీ పార్టీలో అలజడి మొదలయిందా..!?
అవుననే అంటున్నాయి స్థానిక పార్టీ శ్రేణులు..!
వారు చెప్పినట్లుగానే తాజాగా చోటు చేసుకుంటున్న పరిణామాలు గులాబీ పెద్దలను కలవరానికి గురిచేస్తున్నాయి..!
ఇంతకీ గులాబీ పార్టీలో ఏంజరుగుతుంది..! అలజడికి కారణం ఏంటి..? ఎందుకు సమీకరణలు మారుతున్నాయి అంటే..! అన్నిటికీ పార్టీలో జీవన్ రెడ్డి చేరుకునే కారణం అంటున్నారు గులాబీ స్థానికులు..!
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మాజీ మంత్రి టీ జీవన్ రెడ్డి ఏడాదిన్నర పాటు అక్కడ అసమ్మతి రాగం వినిపించి ఇటీవలే ఆ పార్టీకి రాజీనామా చేసి కేసీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ లో చేరారు. !

అయితే ఆయన గులాబీ పార్టీలోకి వస్తున్నారనే అంచనాలు గత ఆరునెలలుగా ఉన్నవే..! అయితే ఆయన చేరినప్పుడు చూద్దాంలే అనుకున్నారు స్థానిక బీఆర్ఎస్ ముఖ్య నేతలు..! కానీ ఈ మధ్య వేగంగా పరిణామాలు మారిపోయాయి.. ఆయన అక్కడ రాజీనామా చేయడం.. ఆ వెంటనే కేటీఆర్ హరీష్ వెళ్ళి కలవడం.. తర్వాత బహిరంగ సభ పెట్టి కేసీఆర్ సమక్షంలో కండువా కప్పుకోవడం చాకచకా జరిగిపోయాయి..!
అయితే ఆయనకు మరో మాజీ మంత్రి ఎల్ రమణతో విబేధాలు ఉన్నాయి.. రమణ ఇదే నియోజకవర్గంలో జీవన్ రెడ్డి తో పలుమార్లు పోటీ పడ్డారు..! వ్యక్తిగతంగా పెద్ద వైరుధ్యాలు లేకపోయినప్పటికీ స్థానిక అధిపత్యం విషయంలో పేచీ ఏర్పడుతోంది..!

టీడీపీలో ఒక వెలుగు వెలిగిన రమణ.. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణ రాష్ట శాఖకు అధ్యక్షుడిగా కూడా కొనసాగారు.. అయితే ఆ పార్టీకి తెలంగాణలో ఆదరణ తగ్గిపోవడం.. ముఖ్యంగా ఉత్తర తెలంగాణలో టీడీపీలో ఉంటే రాజకీయ మనుగడ సాధ్యం కాదనే పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో ఆయన ఆ పార్టీని వదిలి బీఆర్ఎస్ లో చేరారు..! గతంలో కేసీఆర్ ఆయనకు ఎమ్మెల్సీ పదవి ఇచ్చారు..! అయితే కొంతకాలంగా ఆయన యాక్టివ్ గా కనిపించడంలేదనే ఆరోపణలు ఉన్నాయి..! కానీ బీసీ నాయకుడిగా గుర్తింపు ఉన్న రమణకు రాష్ట్రవ్యాప్తంగా టీడీపీలో ఉన్నప్పటినుండే ప్రత్యేక గుర్తింపు ఉంది..! స్థానికంగా జగిత్యాల విషయం వదిలేస్తే.. వివాదరహితుడిగా బయట ఆయనకు మంచి పేరు ఉంది..!
జీవన్ రెడ్డి రాకను ఆయన వ్యక్తిగతంగా వ్యతిరేకించినప్పటికీ.. పార్టీ అధినేత నిర్ణయానికి కట్టుబడి మౌనంగా ఉండిపోయారు.. తాను జీవన్ రెడ్డి రాకను స్వాగతిస్తున్నట్లుగా చెప్పారు..!
అయితే ఆయన జీవన్ రెడ్డి చేరికపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారని.. వేరే పార్టీలోకి వెళ్ళే ఆలోచన చేస్తున్నారని రెండు నెలలుగా ప్రచారం సాగుతోంది..!
ఈ నేపథ్యంలో తాజాగా ఒక అనూహ్య పరిణామం చోటు చేసుకుంది..!
కొత్తగా తెలంగాణ రక్షణ సేన పేరుతో పార్టీ స్థాపించిన కవితను రమణ హైదరాబాద్ లో కలిసినట్లు ప్రచారం సాగుతోంది..! ఆయన వాహనం కవిత ఇంటి ముందు కనిపించడమే ఇందుకు సాక్ష్యంగా చూపుతున్నారు..!
ఎల్ రమణకు చెందిన వోల్వో కార్ కవిత ఇంటిముందు పార్క్ చేసి ఉండగా ఫోటోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు కొందరు..!
అయితే కవిత అనుచరులు మాత్రం వేరే విధంగా చెబుతున్నారు.. కారు రమణదే అయినా.. అందులో ఆయన రాలేదని.. ఆయన సోదరుడు అనుచరులు వచ్చి కవితను కలిసినట్లుగా చెబుతున్నారు..!
కారులో ఆయన వచ్చారా..సోదరుడిని పంపించారా తెలియదు కానీ.. కవితతో రమణ మంతనాలు జరిపిన విషయం ముమ్మాటికీ నిజమని జగిత్యాలకు చెందిన నేతలు చెబుతున్నారు. !

కవిత పార్టీలో చేరేందుకు రమణ సంప్రదింపులు జరుపుతున్నారా..? లేక.. సోదరుడిని ఆ పార్టీలోకి పంపించే ఆలోచనలో ఉన్నారా..? తెలియాల్సి ఉంది..!
బీఆర్ఎస్ లో చేరగానే జీవన్ రెడ్డికి ప్రాధాన్యత పెరిగిపోయింది.. నియోజకవర్గంలో ఆయన ఆధిపత్యమే కొనసాగే పరిస్థితి ఉంది.. ఈ నేపథ్యంలో పార్టీ నుండి వైదొలగడమే మేలు అనే ఆలోచనతో రమణ ఉన్నారని ఆయన అనుచరులు చెబుతున్నారు..!
ఒకవేళ ఇప్పటికిప్పుడు ఆయన వెళ్లకపోయినా.. సోదరుడిని ముందుగా పంపించి కవిత పార్టీకి సంబంధించి స్థానికంగా పగ్గాలు తమ చేతిలో ఉండేవిధంగా జాగ్రత్త పడే అవకాశం ఉందని చెబుతున్నారు. .!
మొత్తానికి కవిత ఇంటి ముందు కనిపించిన కారు..కారు పార్టీలో కంగారు పుట్టించింది జగిత్యాలలో జోకులు పేలుస్తున్నారు..!




Comments