top of page

కామెంట్స్ అలజడి..!

  • Writer: Writer Desk
    Writer Desk
  • 4 days ago
  • 2 min read

గుత్తా సుఖేందర్ రెడ్డి ఆలోచన మారుతోందా..?

కాంగ్రెస్ లో ప్రాధాన్యత ఉన్నప్పటికీ ఎందుకు అసంతృప్తిగా ఉన్నారు..? శాసనమండలి చైర్మన్ గా కొనసాగుతున్న ఆయన సొంత పార్టీపై గుర్రుగా ఎందుకు కనిపిస్తున్నారు..?

రైతులకు సాయం అందించే విషయంలో.ప్రభుత్వం తీరుపై ఎందుకు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు...?

రైతు భరోసా.. బోనస్ పై ప్రతిపక్ష గులాబీ పార్టీ ఆరోపణలు విమర్శలను సమర్థించే విధంగా ఎందుకు బహిరంగ వ్యాఖ్యలు చేస్తున్నారు..?


మొన్నటి ఎమ్మెల్సీల ప్రమాణ స్వీకార కార్యక్రమంలో.కూడా ముఖ్యమంత్రితో కూడా ఎక్కువ మాట్లాడకుండా ముభావంగా ఎందుకు ఉన్నారు..?

అసంతృప్తి ముఖ్యమంత్రిపైనా.. మంత్రులపైనా.. లేక జిల్లాలో ఆధిపత్య పోరుపైననా..?

మొత్తానికి ఆయన ఇటీవల తన సొంత గ్రామంలో ప్రెస్ మీట్ పెట్టీ ప్రభుత్వంపై విమర్శలు చేయడం సంచలనంగా మారింది..! నిజానికి ఆయన ఇదే అంశాలపై అంతర్గత చర్చలో.. లేదంటే ముఖ్యమంత్రికి.. సంబంధిత మంత్రికి నేరుగా సలహా ఇవ్వొచ్చు.. లేదంటే సమస్యను వివరించి పరిష్కరించాలని కోరవచ్చు..! అలా కాకుండా బహిరంగ విమర్శలు చేయడం చూస్తే ఆయన తీవ్ర ఆగ్రహంగానే ఉన్నట్లు కనిపిస్తోంది..! గుత్తా విమర్శలపై ప్రభుత్వం వైపు నుండి వ్యవసాయ శాఖ మంత్రి సహా ఎవరూ స్పందించలేదు..అటు పార్టీ కూడా స్పందించలేదు..! ఆయన అసంతృప్తికి కారణాలను కూడా తెలుసుకునే ప్రయత్నం చేయలేదు..


మరోవైపు సీనియర్ పొలిటీషియన్..పార్టీ మారిన ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి నేరుగా ముఖ్యమంత్రి సహా ప్రభుత్వ పెద్దలపై తీవ్ర విమర్శలు చేసిన కొద్ది రోజుల్లోనే గుత్తా కూడా అసంతృప్తి వ్యక్తం చేయడం కాంగ్రెస్ పార్టీలో కొంత అలజడి సృష్టించింది..!

ఇదే సమయంలో ఇటీవల పార్టీకి గుడ్ బై చెప్పిన మాజీ మంత్రి జీవన్ రెడ్డి సీఎం రేవంత్ రెడ్డి టార్గెట్ గా తీవ్ర ఆరోపణలు చేయడం కూడా పార్టీ శ్రేణులను కలవరానికి గురిచేస్తోంది..!



నిజానికి ఒక్క జీవన్ రెడ్డి మినహా మిగతా ఇద్దరు నాయకులు పార్టీలు మారినవారే..! టీడీపీ అవీర్భవ సమయంలో ఆ పార్టీ నుండి రాజకీయాల్లో ప్రవేశించిన జీవన్ రెడ్డి కొన్నాళ్ళకే కాంగ్రెస్ లో చేరారు.. దాదాపు నాలుగు దశాబ్దాలు కాంగ్రెస్ లోనే కొనసాగారు.. శ్రీనివాస్ రెడ్డి మొన్నటి ఎన్నికలలో కూడా బీఆర్ఎస్ నుండి ఎమ్మెల్యేగా గెలిచి కాంగ్రెస్ లో చేరారు.. పార్టీ ఫిరాయింపు ఆరోపణలు ఎదుర్కొంటున్న పది మంది ఎమ్మెల్యేల్లో ఈయన కూడా ఉన్నారు..! కాబట్టి కాంగ్రెస్ పార్టీ సీనియర్ గా పరిగణించే పరిస్థితి లేదు..! మరో వైపు గుత్తా పరిస్థితి కూడా అంతే..! ఆయన మొన్నటిదాకా బీఆర్ఎస్ లోనే ఉన్నారు..! రైతు బంధు సమితి చైర్మన్ గా బీఆర్ఎస్ హయాంలో పదవిలో కొనసాగారు..! ఆయనను కూడా పార్టీ సీనియర్ గా పరిగణించే పరిస్థితి లేదు.. కానీ ఇపుడు వీళ్ళ విమర్శల ప్రభావం మాత్రం ప్రస్తుత పరిస్థితుల్లో తీవ్రంగానే కనిపిస్తోంది..!


పదవులు దక్కని సీనియర్లు అసంతృప్తిగా ఉన్న పరిస్థితి..! పార్టీ అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్ళు కావొచ్చినా నామినేటెడ్ పోస్టులు భర్తీ చేయకపోవడం వల్ల నెలకొన్న పరిస్థితి.. ఇంకోవైపు రేవంత్ వర్గానికి పదవులు సులువుగా వస్తున్నాయనే అభిప్రాయం బలంగా ఉన్న పరిస్థితి.. వెరసి గుర్రుగా ఉన్న నేతలకు పార్టీకోసం కష్టపడుతున్న వాళ్లకు..గుత్తా, శ్రీనివాస్ రెడ్డి నేతల విమర్శలు ఆజ్యం పోసినట్లు కనిపిస్తోందని పొలిటికల్ సర్కిల్ లో వ్యక్తమవుతున్న అభిప్రాయం..!


అధిష్టానం పెద్దలు ఇతర రాష్ట్రాలలో బిజీగా ఉన్న నేపథ్యంలో వాళ్ళు రాష్ట్రంపై దృష్టి పెట్టలేకపోతున్నారు..!

నామినేటెడ్ పోస్టులను త్వరగా భర్తీ చేసి పార్టీ వర్గాల్లో ఉన్న అసంతృప్తిని చల్లార్చే పని చూడాలని ఇటీవల సమావేశంలో నిర్ణయించారు..!

మరో పది పదిహేను రోజుల్లో.మంత్రి వర్గ విస్తరణ ఉండే అవకాశముందని చెబుతున్నారు..!

ఇవన్నీ కొలిక్కి రావాలంటే.. అధిష్టానం పెద్దలు కచ్చితంగా జోక్యం చేసుకోవాలనే అభిప్రాయం వ్యక్తమవుతోంది..!


••••••••••


A Report By

ShyamaSundar Akula

9010746999


••••••••••

Comments


© Copyrights Reserved 2024 By NewSense News | Designed & Developed by Panchayithi.com 

bottom of page