
అసెంబ్లీ ఎంపీ సీట్లు పెంపు..! మారనున్న రాజకీయం..!
- Writer Desk

- Mar 24
- 2 min read
తెలంగాణలో ఆంధ్రప్రదేశ్ లో అసెంబ్లీ సీట్లు భారీగా పెరగనున్నాయి..!
ఈ సమావేశాల్లోనే బిల్లు పెట్టే అవకాశం..!
తెలుగు రాష్ట్రాల్లో మారనున్న రాజకీయం..!
అప్పటి జనాభా లెక్కల ప్రకారమే కొత్త సీట్ల లెక్క..!
కొత్త లీడర్లు.. సెకండ్ లెవెల్ లీడర్స్ లో ఉత్సాహం..!
దేశంలో లోక్ సభ, అసెంబ్లీ స్థానాలను భారీగా పెంచేందుకు కేంద్రంలో ఉన్న ఎన్డీయే ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకోబోతోంది. ప్రస్తుతం ఉన్న స్థానాలను యాబై శాతం పెంచేందుకు కేంద్రం నిర్ణయం తీసుకుంది..
సోమవారం ఢిల్లీలో జరిగిన ఎన్డీయే భాగస్వామ్య పక్షాల సమావేశంలో ఈ ప్రతిపాదనను వెల్లడించినట్లు తెలుస్తోంది. కేంద్ర హోంమంత్రి అమిత్‌షా, పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు, న్యాయశాఖమంత్రి అర్జున్‌రామ్ మేఘ్‌వాల్‌ల నేతృత్వంలో ఈ సమావేశం జరిగింది..!

ఈ సమావేశాల్లోనే బిల్లు..!
ఈ సమావేశంలో అసెంబ్లీ, లోక్ సభ సీట్లను పెంచడమే కాకుండా.. మహిళా రిజర్వేషన్ల అమలును వేగవంతం చేయడంలో భాగంగా, నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తోందట. ఈ ప్రతిపాదన ప్రకారం ప్రస్తుతం ఉన్న లోక్‌సభ స్థానాలు 543 నుంచి 816కి పెరగనున్నాయి. అదే విధంగా దేశ వ్యాప్తంగా ఉన్న అసెంబ్లీ స్థానాలు 4,123 నుంచి 6,185కి పెరగనున్నాయి.
తెలంగాణలో అరవై..!
ఆంధ్రాలో ఎనబై ఎనమిది..!
కేంద్రం తీసుకోబోయే నిర్ణయం ప్రకారం నియోజకవర్గాల పునర్విభజన జరిగితే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో అసెంబ్లీ సీట్ల సంఖ్య గణనీయంగా పెరగనున్నాయి. తెలంగాణలో ప్రస్తుతం ఉన్న 119 అసెంబ్లీ స్థానాల నుంచి 179కి పెరిగే అవకాశం ఉంది. మరోవైపు ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుతం ఉన్న 175 అసెంబ్లీ స్థానాలు 263కి పెరుగుతాయి. సాధారణంగా నియోజకవర్గాల పునర్విభజన కొత్త జనాభా గణన తర్వాత జరగాల్సి ఉంది. అయితే, 2021 జనాభా గణన ఆలస్యం కావడంతో, 2011 జనాభా లెక్కలనే ప్రాతిపదికగా తీసుకుని ఈ ప్రక్రియను పూర్తి చేయాలని కేంద్రం యోచిస్తోంది.
ఏపీలో తెలంగాణలో ఎంపీ సీట్లు ఇలా..
తెలుగు రాష్ట్రాల్లో పెరగనున్న పార్లమెంట్ సీట్ల లెక్కలు ఇలా ఉన్నాయి..! తెలంగాణ లో ప్రస్తుతం పదిహేడు ఎంపీ సీట్లు ఉన్నాయి..! కొత్తగా మరో తొమ్మిది సీట్లు పెరగనున్నాయి.. దీంతో మొత్తం ఇరవై ఆరు ఎంపీ స్థానాలు కాబోతున్నాయి..
ఇక ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుతం ఉన్న ఇరవై మూడు ఎంపీ స్థానాలకు మరో పదమూడు సీట్లు జత కానున్నాయి.. దీంతో మొత్తం ఎంపీ స్థానాలు ముప్పై ఎనిమిది కాబోతున్నాయి..! మొత్తంగా తెలుగు రాష్ట్రాలలో ఇరవై రెండు ఎంపీ స్థానాలు పెరగబోతున్నాయి..!
మహిళలకు ముప్పై మూడు శాతం..!
2029 సార్వత్రిక ఎన్నికల నాటికి పెరిగిన సీట్లతో పాటు మహిళలకు 33 శాతం రిజర్వేషన్లను కూడా అమలు చేయడం సాధ్యమవుతుందని కేంద్ర ప్రభుత్వం యోచిస్తోంది.ఈ నియోజకవర్గాల పెంపునకు సంబంధించి ప్రస్తుత పార్లమెంటు బడ్జెట్ సమావేశాల్లోనే కేంద్రం బిల్లును ప్రవేశపెట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇందుకోసం రాజ్యాంగంలోని ఆర్టికల్ 82, 170 లకు సవరణలు చేయాల్సి ఉంటుంది.

దక్షిణాదికి నష్టమే..!
అయితే, జనాభా ప్రాతిపదికన సీట్లు పెంచితే జనాభా నియంత్రణను పాటిస్తున్న దక్షిణాది రాష్ట్రాలకు నష్టం జరుగుతుందనే ఆందోళన వ్యక్తం అవుతోంది. ఈ నేపథ్యంలో ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలతో పాటు ప్రతిపక్షాలను కూడా ఒప్పించేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఒకవేళ ఈ బిల్లు ఆమోదం పొందితే, భారత ప్రజాస్వామ్య చరిత్రలో ఇది అతిపెద్ద సంస్కరణగా నిలిచిపోనుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది..!
........
A Report By
Suneetha Bommella




Comments