
కవిత పార్టీకి ఆయనే సలహాదారు..!
- Writer Desk

- Jan 19
- 2 min read
వ్యూహాత్మక అడుగు..!
గులాబీ పార్టీ నుండి తెగతెంపులు చేసుకున్న కేసీఆర్ కుమార్తె కవిత కొత్త రాజకీయ పార్టీకి ఏర్పాట్లు ముమ్మరం చేశాడు...
ఇప్పటికే జనం బాట పేరుతో రాష్ట్రంలో పర్యటించిన కవిత ఒకవైపు ప్రజలను కలిసే కార్యక్రమం కొనసాగిస్తూనే మరోవైపు కొత్త రాజకీయ పార్టీ స్థాపనవైపు అడుగులు వేస్తున్నారు...
పార్టీ ఏర్పాటు ఖాయమని గతంలోనే కవిత స్పష్టం చేసారు.. బిఆర్ఎస్ పార్టీతో విబేధాలు తలెత్తిన తర్వాత ఆ పార్టీ ముఖ్యనేతలపై నేరుగా విమర్శలు మొదలుపెట్టిన కవిత ఈ మధ్య కాలంలో తెలంగాణ వాదులను, మేధావులను కలుస్తూ వారితో తెలంగాణకు చెందిన అంశాలపై చర్చిస్తూ వచ్చారు.. తెలంగాణ జాగృతి పేరుతో ఒక సంఘాన్ని నడిపిస్తున్న కవిత అదే వేదిక ద్వారా అందరినీ కలుస్తున్నారు. కవిత కొత్త పార్టీ పెడుతున్నారంటూ గతంలోనే చర్చ జరిగినప్పటికీ.. ఆమె మాత్రం తొందరపడలేదు...

తండ్రి బాటలోనే...
టీఆర్ఎస్ పార్టీ స్థాపించడానికి ముందు తన తండ్రి కేసీఆర్ అందరితో చర్చించారని.. సుదీర్ఘ చర్చల తర్వాతనే ఆయన ఒక వేదికగా ఉన్న టీఆర్ఎస్ ను రాజకీయ పార్టీగా ప్రకటించారని.. తను కూడా అదేమదిరిగా అందరితో కలిసి చర్చించిన తర్వాతనే పార్టీ స్థాపనపై నిర్ణయం తీసుకుంటానంటూ జనంబాట కార్య్రమానికి ముందు ఆమె స్పష్టం చేసారు..!
జనంబాట కార్యక్రమ ద్వారా రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో పర్యటించిన కవిత ప్రజల్లో తనకు ఉన్న ఆదరణను అంచనా వేసే ప్రయత్నం చేశారు.. పార్టీ స్థాపించిన పక్షంలో నిలదొక్కుకోవడం ఎలా అనే అంశాలపై కూడా జిల్లాల వారీగా జాగృతి నేతలతో చర్చించారు..

ఇపుడు పార్టీ విషయంలో కవిత మరో వ్యూహాత్మక అడుగు వేశారు. రాజకీయ వ్యూహకర్తగా దేశవ్యాప్తంగా పాపులర్ గా మారిన ప్రశాంత్ కిషోర్ (పీకే) తో తాజాగా చర్చలు జరిపారు. తను స్థాపించే రాజకీయ పార్టీకి దిశా నిర్దేశం చేయడానికి సహకరించాలని కవిత పీకేను కోరినట్లు సమాచారం..!
సంక్రాంతి సమయంలో చర్చ..!
ప్రశాంత్ కిషోర్ తో కవిత భేటీ ని జాగృతి వర్గాలు ధృవీకరించాయి.. కానీ వారిద్దరి మధ్య ఏయే అంశాలు చర్చకు వచ్చాయనే విషయం తెలియదని వారు స్పష్టం చేసారు.
సంక్రాంతికి ముందు హైదరాబాద్ వచ్చిన ప్రశాంత్ కిషోర్ ఐదు రోజులపాటు ఇక్కడే ఉన్నారని, కవితను ఆమె నివాసంలోనే కలిసిన ప్రశాంత్ అక్కడే చర్చలు జరిపినట్లు వారు తెలిపారు..
కవిత ప్రశాంత్ ఇద్దరు మాత్రమే చర్చలో పాల్గొన్నందున చర్చకు సంబంధించిన అంశాలేవి బయటకు రాలేదు కానీ.. కవిత రాజకీయ పార్టీకి సంబంధించి రాజకీయ వ్యూహకర్తగా ప్రశాంత్ కిషోర్ సహకారం అందించడం ఖాయమని జాగృతి వర్గాలు చెబుతున్నాయి..

చక చకా ఏర్పాట్లు....
రాజకీయ పార్టీ స్థాపనపై కచ్చితమైన నిర్ణయం తీసుకున్న కవిత పార్టీ రిజిస్ట్రేషన్ కు సంబంధించిన ప్రక్రియను కూడా దాదాపు పూర్తిచేసినట్లుగా తెలుస్తోంది..
ఎన్నికల కమిషన్ కు కూడా రిజిస్ట్రేషన్ కు సంబంధించిన వివరాలు పంపించినట్లుగా తెలుస్తోంది. అన్నీ అనుకున్నట్లుగా జరిగితే మరో మూడు నెలల్లో పార్టీకి సంబంధించి అన్ని పనులు పూర్తి కావచ్చు..!

రాష్ట్రం ఆవిర్భవించిన రోజే..!
తెలంగాణ రాష్ట్రం అధికారికంగా ఏర్పడింది జూన్ రెండవ తేదీన కావడంతో అదే రోజున పార్టీ జెండా ఎజెండాను కవిత ప్రకటించే అవకాశమున్నట్లు తెలుస్తోంది...
అయితే రాష్ట్ర అవీర్భావ దినోత్సవ రోజు ప్రకటన అనేది కేవలం ఒక పరిశీలన మాత్రమే అని.. ముందు రిజిస్ట్రేషన్ ప్రక్రియ మొత్తం పూర్తిచేసిన తర్వాత ప్రకటనపై ముహూర్తంపై నిర్ణయం తీసుకునే అవకాశముందని.. ఇప్పటికిప్పుడు ఏమీ చెప్పలేమని జాగృతి ముఖ్య నాయకుడు ఒకరు తెలిపారు..
......
A Report by
ShyamaSundar Akula
.......




Comments