
కవిత పార్టీ.. టీఆర్ఎస్...!
- Writer Desk

- 6 days ago
- 2 min read
తెలంగాణలో టీఆర్ఎస్ మళ్ళీ రాబోతోందా..!
తెలంగాణ అస్తిత్వ ప్రతీక.. ఉద్యమ గీతిక తెలంగాణ రాష్ట్ర సమితి అంటూ రెండున్నర దశాబ్దాల క్రితం ఒక సంఘం రూపంలో ఆవిర్భవించిన టీఆర్ఎస్.. ఆ తర్వాత రాజకీయ పార్టీగా రూపాంతరం చెందిన విషయం అందరికీ తెలిసిందే.. టిఆర్ఎస్ సంఘాన్ని స్థాపించి రాష్ట్ర సాధన ఉద్యమం చేపట్టిన కేసీఆర్.. చట్ట సభల్లో గట్టిగా తెలంగాణ వాణి వినిపించడానికి రాజకీయ పార్టీగా సంఘాన్ని మార్పు చేస్తున్నట్లు ప్రకటించారు..! టీఆర్ఎస్ ఒక చరిత్ర సృష్టించింది.. ఉద్యమ పోరాటాన్ని నడిపించడంలో విజయం సాధించింది.. తెలంగాణ అస్థిత్వాన్ని ఆత్మగౌరవాన్ని చాటి చెప్పే పార్టీగా టిఆర్ఎస్ ను నిలబెట్టడంలో కేసీఆర్ పూర్తిగా విజయం సాధించారు.. రాష్ట్రం ఏర్పడిన తర్వాత 2014 లో జరిగిన తొలి ఎన్నికలలో భారీ విజయంతో టిఆర్ఎస్ అధికారాన్ని చేపట్టింది.! తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రిగా కేసీఆర్ చారిత్రాత్మక ఘనత సాధించారు..! దాదాపు పదేళ్లు అధికారంలో ఉన్న కేసీఆర్..2018 ఎన్నికలలో రెండవసారి అధికారంలోకి వచ్చాక జాతీయ రాజకీయాల్లోకి వెళ్ళాలనే ఆలోచనతో పార్టీ పేరు కూడా మార్చేశారు..! తెలంగాణ రాష్ట్ర సమితిని భారత రాష్ట్ర సమితిగా మార్చారు..!
అయితే పేరు మార్పు పూర్తిగా దుష్ఫలితాలనే కేసీఆర్ కు చూపెడుతోంది..! పేరు మార్పు ద్వారా తెలంగాణ అస్థిత్వాన్ని పార్టీ కోల్పోయిందని తెలంగాణ వాదులు అప్పట్లోనే విమర్శలు చేశారు.. ఆ తర్వాత కేసీఆర్ పాలనా పరంగా అనేక ప్రతికూల ఫలితాలు చవి చూడాల్సి వచ్చింది.. చివరికి 2023 ఎన్నికలలో ఏకంగా అధికారం కూడా కోల్పోయారు.. ఆ తర్వాత ప్రమాదాలు ఆరోగ్య సమస్యలు ఎదుర్కున్నారు.. ఆ తర్వాత వచ్చిన ఎంపీ ఎన్నికలలో కూడా పార్టీ పూర్తిగా ఢీలా పడిపోయింది.. కుమార్తె కవిత డిల్లీ లిక్కర్ కేసులో అరెస్ట్ అయ్యారు.. ఆ తర్వాత ఆమె కుటుంబ విభేదాలతో పార్టీకి దూరం అయ్యారు.. పేరు మార్పు తర్వాత ఇంటాబయటా రాజకీయంగా ఇప్పటికీ కేసీఆర్ అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారు..!
పార్టీ పేరును మళ్లీ టీఆర్ఎస్ గా మార్చేయాలని మెజారిటీ సీనియర్ నేతలు డిమాండ్ చేసినప్పటికీ కేసీఆర్ మొండి పట్టుదలతో మార్పుకు అంగీకరించడం లేదని తెలుస్తోంది.. ఆ మధ్య పేరు మారుస్తున్నట్లు జోరుగా ప్రచారం జరిగినప్పటికీ ఆ తర్వాత అలాంటిది ఏమీ లేదని కేసీఆర్ చెప్పడంతో ప్రచారానికి తెరపడింది.. మొత్తం మీద టీఆర్ఎస్ పేరు కేసీఆర్ కు..ఆ పార్టీ నేతలకు ఎంత కలిసి వచ్చిందో.. పేరు మార్చిన తర్వాత అంత నష్టం వాటిల్లుతోంది...!
ఇదిలా ఉంటే తాజాగా మళ్లీ టిఆర్ఎస్ పేరు హాట్ టాపిక్ గా మారింది...

కొత్త రాజకీయ పార్టీ స్థాపిస్తున్న కేసీఆర్ తనయ కవిత తాజాగా చేసిన కామెంట్స్ ఆసక్తి కరంగా మారాయి..!
ఇదే నెల 25న ఆమె కొత్త పార్టీ ప్రకటనకు ముహూర్తం నిర్ణయించారు..ఈ నేపథ్యంలో పార్టీ పేరుపై ఆసక్తి పెరుగుతోంది.. మీడియా ప్రతినిధులతో చిట్ చాట్ సందర్భంగా పార్టీ పేరు ప్రస్తావనకు వచ్చింది.. అదే సందర్భంలో టీఆర్ఎస్ పేరు గురించి కూడా ఆలోచిస్తున్నట్లు కవిత చెప్పారు..! ఇప్పటికీ తెలంగాణ రాష్ట్ర సమితి పేరు ఖాళీగానే ఉందని.. కేసీఆర్ బీఆర్ఎస్ గా పార్టీ పేరు మార్చిన నాటి నుండి కూడా టీఆర్ఎస్ పేరు ఎవరూ రిజిస్టర్ చేసుకోలేదని .. టిఆర్ఎస్ పేరు ఎలా ఉంటుంది అనే ఆలోచన కూడా చేస్తున్నట్లు కవిత చెప్పారు..! పార్టీ రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తవుతుందని కూడా చెప్పారు. అయితే కవిత స్పష్టంగా తమ పార్టీ పేరు ఇదే అంటూ ఏ పేరు చెప్పలేదు..! కవిత రాజకీయ పార్టీ పెట్టాలనే ఆలోచనకు వచ్చినప్పటినుండి ఆమె ఆధ్వర్యంలో కొనసాగుతున్న తెలంగాణ జాగృతి పేరునే రాజకీయ పార్టీకి కూడా పెడతారనే అందరూ భావిస్తున్నారు.. పలు సందర్భాల్లో కవిత సహా జాగృతి నేతలు కూడా ఇదే విషయాన్ని ధృవీకరిస్తున్నట్లు చెప్పారు..! దాదాపు అదే పేరును ఖరారు చేసి రిజిస్ట్రేషన్ చేయించినట్లుగా విశ్వసనీయ సమాచారం.. అయితే సడెన్ గా ఆమె టీఆర్ఎస్ పేరు ప్రస్తావించి మాట్లాడడంతో తెలంగాణ రాష్ట్ర సమితి పేరుపై కూడా ఆమె ఆలోచన చేస్తోందా..? లేదంటే కావాలనే అయోమయం సృష్టించేందుకు అలా కామెంట్స్ చేశారా అనే విషయం తెలియాల్సి ఉంది..!
జాగృతి నేతలు మాత్రం పార్టీ పేరులో జాగృతి పదం ఖాయంగా ఉంటుందని ఘంటాపథంగా చెబుతున్నారు..!
°°°°°°°
A Report By
ShyamaSundar Akula
9010746999




Comments