top of page

దోశ తినిపిస్తానని తీసుకెళ్లి ముగ్గురి పిల్లల ప్రాణం తీశాడు

  • Writer: Writer Desk
    Writer Desk
  • 2 days ago
  • 3 min read

తల్లిదండ్రులు చేసే తప్పులకు పిల్లలు బలవుతున్నారు..! కంటికి రెప్పలా కాపాడాల్సిన కన్నవాళ్ళే.. అభం శుభం తెలియని వయసులో చిన్నారుల ప్రాణం తీస్తుంటే.. దీనంగా రోదిస్తూ అమ్మా.. నాన్నా.. అంటూనే ఊపిరాడక గిలగిలా కొట్టుకుంటూ జీవం కోల్పోతున్న పిల్లల పరిస్థితి.. ఎంత హృదయ విదారకంగా ఉంటుంది..?


మీ బ్రతుకేంటో తెలిసినపుడు.. పిల్లలను కనిపెంచే

స్థోమత లేదని ముందే తెలిసినపుడు.. ఎందుకు ఇలా చేస్తున్నారు.. ఒకరి వెంట ఒకరిని కనిపడేసి.. ఆ తర్వాత వల్ల కాదు అని ముక్కుపచ్చలారని చిన్నారుల ఉసురు తీసే హక్కు మీకు ఎవరు ఇచ్చారు..? మీరు బాధ్యత లేకుండా తప్పులు చేసి.. పిల్లలను ఎందుకు బలిచేస్తున్నారు.. వాళ్ళు ఏంచేశారని చంపేస్తున్నారు..?


ఈమధ్య కాలంలో చోటు చేసుకుంటున్న ఘటనలు తల్లిదండ్రులంటే భయం పుట్టించేలా చేస్తున్నాయి..


మానసిక ఒత్తిడి.. కుటుంబ కలహాలు..అక్రమ సంబంధాలు.. ఆర్థిక కష్టాలు.. కారణం ఏదైనా.. ముందు పిల్లల ప్రాణాలు తీయడం.. సాధారణ విషయంగా మారిపోతోంది..!


ఇక్కడ చదువుకున్న వాళ్ళు సంపన్నులు పేదవాళ్లు అనే తేడా లేదు.. ఉన్నత ఉద్యోగం.. ఆస్తిపాస్తులు.. అన్ని సదుపాయాలు ఉన్నవాళ్ళు కూడా మానసిక సమస్యలతో పిల్లల ప్రాణాలు తీస్తున్నారు..



ఆ మధ్య ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగి చెట్టంత ఎదిగిన ఇద్దరు పిల్లలను తనతో పాటు తీసుకెళ్లి చర్లపల్లి లో రైలు పట్టాలపై నిలబడి ఇద్దరి పిల్లలతో సహా బలవన్మరణానికి పాల్పడింది.. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ ఘటనలో ఇప్పటికీ ఆమె ఎందుకలా చేసింది అనే విషయంలో బలమైన కారణం మాత్రం తెలియలేదు.. ఆమె కూడా మరణించింది కాబట్టి.. కారణం ప్రశ్నగానే మిగిలిపోయింది..!


తర్వాత మరో యువ మహిళ కూడా తన ఇద్దరి చిన్నారులను ఉరివేసి చంపేసి తనూ తనువు చాలించింది.. ప్రేమించి పెళ్లిచేసుకున్న భర్త తాగుడుకు బానిసై.. ఊరంతా అప్పులు చేయడంతో అయినవాళ్ళు కూడా దూరమై.. బ్రతుకు భారంగా అనిపించి ఆమె ఇంతటి అఘాయిత్యానికి పాల్పడింది..!


మరో వ్యక్తి తన బిడ్డను బైక్ పై తీసుకువెళ్ళి నదిలోకి తోసివేసి బిడ్డ మునిగి చనిపోయేవరకు అక్కడే ఉండి తర్వాత ఇంటికి వచ్చి ఏమీ ఎరగనట్లు నటించాడు.. కన్నబిడ్డ నీళ్లలో మునుగుతూ నాన్నా కాపాడు అంటూ భయంతో ఏడుస్తుంటే కూడా కనీసం అతడి మనసు కరగలేదు..!


మళ్ళీ ఇపుడు అలాంటి ఘటననే చోటు చేసుకుంది.. కన్నతండ్రి తన ముగ్గురు చిన్నారులను దోష తినిపిస్తానంటూ తీసుకువెళ్లి చెరువులోకి తోసి చంపేశాడు.. రంజన్ శుభమాసంలో తండ్రి తమకు దోష తినిపిస్తానంటే.. ఎంతో సంతోషంగా తండ్రితో వెళ్ళిన బిడ్డలు... తండ్రి తమను నీళ్లలోకి తోసేస్తుంటే.. ప్రాణ భయంతో ఆ చిన్నారులు నాన్నా నాన్నా అంటూ దీనంగా అర్థనదాలు చేస్తున్నా.. ఆ తండ్రి మనసు కరగలేదు..!


చిన్న చిన్న సమస్యలు కష్టాలను పెద్దగా ఊహించుకుంటూ క్షణికావేశంలో చేస్తున్న దుశ్చర్యలే ఇక్కడ ఎక్కువ కనిపిస్తున్నాయి..!


మానసిక ఒత్తిడి సమస్యను అదిగమించేందుకు అనేక మార్గాలున్నాయి.. భర్త తాగుబోతు తిరుగుబోతు అయితే.. అతనితో దూరంగా ఉండి.. ఎలాగోలా ఏదో ఒక ఉద్యోగం చేస్తూ.. లేదంటే.. కూలీ పని చేస్తూ కూడా మంచిగా బ్రతుకుతూ పిల్లలను చూసుకోవచ్చు..!


ఆర్థిక సమస్యలను కూడా కాస్త ఓపికగా ఆలోచించి కష్టపడి పనిచేసి అధిగమించవచ్చు..!


కానీ అలాచేయకుండా క్షణికావేశంలో పిల్లల ప్రాణాలు తీసి తాము ప్రాణాలు కోల్పోవడం వల్ల వచ్చేది ఏముంటుంది..!



తాజాగా కామారెడ్డి పట్టణంలో.చోటుచేసుకున్న దుర్ఘటన అందరినీ కలిచివేస్తుంది..! ఆటో నడుపుతూ జీవనం సాగించే వ్యక్తి తన ముగ్గురు పిల్లలను చెరువులోకి తోసేసి ప్రాణాలు తీశాడు.. అంతే కాదు.. ఇంటికి వచ్చి వారు కనిపించడం లేదంటూ నాటకమాడాడు.. అయితే కేసు నమోదు చేసిన పోలీసులు అతన్ని గట్టిగా విచారించేసరికి అసలు విషయం బయటపెట్టాడు.. తానే తన ముగ్గురు పిల్లలను ఆటోలో తీసుకువెళ్లి చెరువులో తోసి చంపేశారని చెప్పాడు..!


కామారెడ్డి పట్టణం ఆర్ పి నగర్ లో నివసించే ఇస్మాయిల్ భార్య షబీనా..కుమార్తెలు షీపత్ (8) అయత్ (7) మరియం (5) ఉన్నారు.. ఆటో నడుపుతూ జీవనం సాగిస్తున్న ఇస్మాయిల్ కు తోడుగా అతని భార్య షబీనా కూడా రోజు కూలీగా పనికి వెళ్తూ ఆర్థికంగా ఆసరాగా నిలుస్తోంది.. శనివారం షబీనా పనికి వెళ్లగా.. ఇస్మాయిల్ కూడా బయటకు వెళ్లి.. మళ్ళీ ఇంటికి వచ్చాడు.. బయటకి తీసుకెళ్లి హోటల్ లో దోశ తినిపిస్తానని చెప్పాడు.. దీంతో పిల్లలు హుషారుగా తండ్రితో పాటు ఆటోలో బయలుదేరారు.. అయితే తండ్రి హోటల్ కి కాకుండా నేరుగా స్థానిక పెద్ద చెరువు వద్దకు తీసుకెళ్లాడు.. తండ్రి ఏం చేస్తున్నాడో అర్థమయ్యేలోపే వాళ్లని ఒకరొకరిగా బలవంతంగా చెరువు నీళ్లలో పడేశాడు.. నీళ్లలో మునుగుతూ తండ్రిని కాపాడమని వేడుకుంటూ ప్రాణభయంతో ఊపిరాడక పిల్లలు గిలగిలా కొట్టుకుంటూ తండ్రివైపు చూస్తూనే ప్రాణాలు కోల్పోయారు..

పిల్లలు ముగ్గురు చనిపోయారనే నిర్ధారణ వచ్చేవరకు అక్కడే ఉండి ఆ దారుణాన్ని కళ్ళారా చూసిన తండ్రి ఆ తర్వాత ఇంటికి చేరుకున్నాడు.. సాయంత్రం ఇంటికి వచ్చేసరికి పిల్లలు కనిపించకపోవడంతో ఆమె భర్తను నిలదీసింది.. అయితే తాను పిల్లలను హోటల్ వద్ద దోశ తినిపించడానికి తీసుకువెళ్లగా.. ఒక గిరాకీ తగలడంతో వారిని అక్కడే ఉండమని చెప్పి వెళ్లాలని.. తిరిగి వచ్చేసరికి వాళ్ళు అక్కడలేరని ఇస్మాయిల్ బుకాయించే ప్రయత్నం చేశాడు.. అయితే అతని వాలకం అనుమానాస్పదంగా కనిపించడంతో.. షబానా వెంటనే పోలీసు స్టేషన్ కి వెళ్లి ఫిర్యాదు చేసింది.. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు ఇస్మాయిల్ ను తమదైన శైలిలో విచారించి నిజాన్ని కక్కించారు.. అతడిచ్చిన సమాచారంతో గజ ఈతగాళ్లను సహాయక బృందాలను తీసుకువెళ్లి చెరువులో గాలింపు చేపట్టారు.. ఇద్దరు పిల్లల మృతదేహాలను వెలికితీశారు.. మరో చిన్నారి మృతదేహం ఇంకా లభ్యం కావలసి ఉందని పోలీసులు తెలిపారు..


కన్న తండ్రి కాలయముడై ముగ్గురు బిడ్డల ఉసురుతీసిన వైనాన్ని విని తట్టుకోలేక ఆ తల్లి తల్లడిల్లిపోయి చేస్తున్న ఆక్రందనలు చూసే వారిని కంటతడి పెట్టిస్తున్నాయి..!


•••••••

A Report By

ShyamaSundar Akula

9010746999







Comments


© Copyrights Reserved 2024 By NewSense News | Designed & Developed by Panchayithi.com 

bottom of page