top of page

జేడీ వదిలేసినట్లేనా..!?

  • Writer: Writer Desk
    Writer Desk
  • 1 day ago
  • 2 min read

జేడీ లక్ష్మీనారాయణ..!


పదిహేనేళ్ల క్రితం ఈ పేరు చెబితేనే రాజకీయ గండరగండులు కూడా హడలెత్తిపోయారు... భయంతో బిక్క చచ్చిపోయారు...!


నిజానికి జేడీ అనేది ఆయన ఇంటిపేరు కాదు..! ఆయన ఇంటిపేరు వాసగిరి..! లక్ష్మీనారాయణకు ముందు వెంకట అని ఉంటుంది.. మొత్తంగా వాసగిరి వెంకట లక్ష్మీనారాయణ..! షార్ట్ గా వీవీ తో పిలిచేవారు..!


కానీ ఆయన వృత్తి పరంగా చేపట్టిన హోదా.. ఆయన ఇంటిపేరుగా మారిపోయింది..

ఐపీఎస్ గా టాపర్ గా ప్రతిభ చూపిన ఆయనను కేంద్ర ప్రభుత్వం అప్పట్లో సీబీఐ ఆంధ్రప్రదేశ్ జాయింట్ డైరెక్టర్ గా నియమించింది..


వైఎస్ మరణానంతరం పలు అవినీతి వ్యవహారాలపై సీబీఐ దర్యాప్తు మొదలుపెట్టింది..


ఇందులో ప్రధానమైనది ఓబుళాపురం మైనింగ్, జగన్ అక్రమాస్తుల కేసులు..! ఈ రెండు కేసులలో దర్యాప్తులో లక్ష్మీనారాయణ చూపించిన చొరవ.. ప్రలోభాలకు లొంగకుండా నిందితులను బోను ముందు నిలబెట్టిన వైనం అక్రమార్కుల వెన్నులో వణుకు పుట్టించింది..!


ఓబుళాపురం కేసులో ప్రముఖ రాజకీయ నాయకుడు మైనింగ్ కింగ్ గాలి జనార్ధన్ రెడ్డిని కటకటాల వెనక్కి నెట్టించిన లక్ష్మీనారాయణ.. ఆ తర్వాత జగన్ ను కూడా అరెస్ట్ చేయించాడు..!



గాలి జనార్ధన్ రెడ్డి బెయిల్ విషయంలో ప్రలోభాలకు అడ్డదారి తొక్కిన ఒక జడ్జీని కూడా జైలుకు పంపించిన లక్ష్మీనారాయణ తెగువ చూసి అందరూ ఆశ్చర్యపోయారు...


విధి నిర్వహణలో నిక్కచ్చిగా వ్యవహరించడం.. ఎంతటివారైనా లెక్కచేయకుండా చట్టం ముందు దోషులుగా నిలబెట్టడానికి ఆయన చూపించిన సాహసం సర్వత్రా ప్రశంసలందుకుంది..!


అప్పటినుండే జాయింట్ డైరెక్టర్ హోదా ఆయనకు ఇంటిపేరులా మారిపోయింది.. వీవీ లక్ష్మీనారాయణను అందరూ జేడీ లక్ష్మీనారాయణ అని పిలవడం మొదలు పెట్టారు..


మీడియా కూడా జేడీ లక్ష్మీనారాయణ అనే పేరునే హైలైట్ చేసింది..!


మొత్తంగా ఉద్యోగంలో తన ప్రతిభతో నిజాయితీతో దేశవ్యాప్తంగా పేరుతెచ్చుకున్న లక్ష్మీనారాయణ.. ఆ తర్వాత తన దృష్టిని రాజకీయాలవైపు మళ్ళించారు...


2018 లో ఆయన స్వచ్ఛంద పదవీ విరమణ చేసి పూర్తి స్థాయిలో రాజకీయాల్లోకి ప్రవేశించారు.. 2019 లో అనూహ్యంగా జనసేన పార్టీలో చేరి విశాఖ నుండి ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు.. ఆ తర్వాత పవన్ తో పొసగకపోవడంతో ఏడాదిలోనే జనసేన నుండి బయటపడ్డారు. తర్వాత బీజేపీ వైపు చూసారు. కొన్ని కారణాల వల్ల అక్కడ కూడా చేరలేదు..! తన ఆకాంక్షలు సిద్ధాంతాలను అమలుచేయాలనుకుంటే సొంతంగా పార్టీ స్థాపించడమే మేలని భావించిన ఆయన 2023 డిసెంబర్ లో జైభారత్ నేషనల్ పార్టీ పేరుతో కొత్త రాజకీయ పార్టీని స్థాపించారు.. 2024 అసెంబ్లీ ఎన్నికలలో విశాఖ నార్త్ నియోజకవర్గం నుండి పోటీ చేసి ఓడిపోయారు..ఒకవైపు రాజకీయాల్లో కొనసాగుతూనే జాయింట్ ఫర్ డెవలప్మెంట్ పేరుతో ఒక ఫౌండేషన్ ఏర్పాటుచేసి పలు సామాజిక కార్యక్రమాలు నిర్వహించారు..


అసెంబ్లీ ఎన్నికలలో తమ పార్ట్ ఏ మాత్రం ప్రభావం చూపకపోవడంతో ఆయన రాజకీయాల్లో కొనసాగడంపై పునరాలోచన చేసినట్లు కనిపిస్తోంది...



మేఘా సంస్థలో చేరిన వీవీ..!

ఏపీకి చెందిన మేఘా ఇంజనీరింగ్ ఇండస్ట్రీ సంస్థ వైస్ ప్రెసిడెంట్ గా ఆయన తాజాగా ఉద్యోగంలో చేరారు. మేఘా సంస్థ అనుబంధ విభాగాల పర్యవేక్షణ బాధ్యతలు ఆయన చూడనున్నట్లు తెలుస్తోంది..


వీవీ లక్ష్మీనారాయణ చేరిక విషయాన్ని మేఘా సంస్థ ధృవీకరించినట్లు తెలుస్తోంది..!


మొత్తంగా సీబీఐ అధికారిగా ఒక వెలుగు వెలిగిన వీవీ వృత్తి పరంగా ఎన్నో విజయాలు సాధించారు...


కానీ రాజకీయాల్లో మాత్రం ఓటమిని చవిచూశారు....ఏ దశలోనూ రాజకీయాల్లో నిలదొక్కుకోలేక.. తన స్వభావాన్ని రాజకీయ నాయకుడి పాత్రకోసం మార్చుకోలేక.. చివరికి రాజకీయాలనే వదులుకోవాల్సిన పరిస్థితి తెచ్చుకున్నారు...!


పొలిటికల్ వీవీ కంటే పోలీస్ జేడీ గానే ఆయన గుర్తింపు ఎక్కువ..!


••••••••

A Report By

ShyamaSundar Akula

9010746999

••••••••

Comments


© Copyrights Reserved 2024 By NewSense News | Designed & Developed by Panchayithi.com 

bottom of page