top of page

తల్లీ..ఎల్లమ్మా..!

Writer: Writer Desk
Writer Desk
Jan 16
2 min read

హైదరాబాద్ : నటుడు వేణు ఎల్దండి దర్శకుడిగా తొలి చిత్రం బలగంతో సంచలనం సృష్టించాడు. తెలంగాణ ప్రజలలో బలగం ఒక ప్రత్యేక గుర్తింపు కలిగిన సినిమా..!


పూర్తిగా ఏళ్లనాటి గ్రామీణ జీవన శైలిని... ఎవరైనా మరణిస్తే కుటుంబాలు బంధువులు స్నేహితులు (మొత్తంగా కలిపి బలగం లేదా బంధు బలగం అంటారు తెలంగాణలో) ఎలా వ్యవహరిస్తారు.. మాటపట్టింపులు తగువులు ప్రేమలు బంధాలు.. కళ్ళకు కట్టినట్లు చూపించిన వేణు.. ప్రజల మనసు గెలుచుకున్నాడు..


బలగం సినిమాను ఊర్లలో తెరలు కట్టి ప్రదర్శించారు... దశాబ్దాల తర్వాత అలాంటి దృశ్యం బలగం.సినిమాతో మళ్ళీ ఆవిష్కృతమైంది.. అంతలా ప్రజలను ఆకట్టుకున్న బలగం రూపకల్పన దర్శకుడిగా వేణు సృజనాత్మక శక్తికి నిదర్శనంగా నిలిచింది..


బలగం సినిమాను చూసిన ప్రతి ఒక్కరు వేణు ప్రతిభను చూసి ఆశ్చర్యపోయారు..


బలగం చిత్రాన్ని ప్రముఖ నిర్మాత దిల్ రాజు తన వెంకటేశ్వర బ్యానర్ పై నిర్మించారు.. ఈ సినిమా తర్వాత ఎల్లమ్మ పేరుతో వేణు దర్శకత్వంలో మరో సినిమా నిర్మించబోతున్నట్లు దిల్ రాజు ప్రకటించినప్పటికీ.. చాన్నాళ్లుగా ఈ ప్రాజెక్ట్ పెండింగ్ లో పడుతూ వచ్చింది.. ఎట్టకేలకు ఇప్పుడు పట్టాలపైకి వచ్చింది...

సంక్రాంతి సందర్భంగా ఎల్లమ్మ గ్లింప్స్ ను విడుదల చేశారు.. చూడగానే ఆకట్టుకుంటున్న ఈ వీడియో క్లిప్... తెలంగాణ లో గ్రామ దేవతగా ప్రసిద్ధి పొందిన ఎల్లమ్మ జాతర వైనాన్ని కళ్ళకు కట్టేలా ఉండబోతున్నట్లుగా కనిపిస్తోంది..


ఇంకో విశేషం ఏంటంటే... ఈ క్లిప్ లో ప్రముఖ సంగీత దర్శకుడు రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ నటుడిగా పర్శీ పేరుతో ఒక బలమైన ప్రధానమైన పాత్రలో కనిపిస్తున్నాడు..

గ్లింప్స్.. గూస్ బంప్స్..!


ఎల్లమ్మ వీడియో క్లిప్ చూస్తుంటే వెంట్రుకలు నిక్కబొడుస్తునట్లుగా అనిపిస్తుంది..! రెండు నిమిషాల నిడివిగల వీడియో ఆది నుండి చివరి వరకు కళ్ళార్పనివ్వదు..!


బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ లో వచ్చే రుద్ర సాంగ్.. మొత్తం దృశ్యాన్ని వేరే లెవెల్ కి తీసుకువెళ్ళింది...

ఆది నుండి చివరివరకు మొత్తం ఒక వేప ఆకు మాత్రం ఎగురుతూ వెళ్తుంటుంది...


సుడిగుండంలా తిరుగుతున్న ద్రవంలో వేపాకు తిరుగుతూ పైకి వెళ్ళి కాళ్ళకు గజ్జెలు... బూట్లు ధరించిన ఇద్దరు మనుషుల కాళ్ళవద్ద ఒక చిన్న పావురంలా తిరుగుతూ చివరివరకు ఆసక్తికలిగిస్తుంది..


అంతకుముందు ఆకాశంలో మెరుపులా ఆవిష్కృతమయ్యే ఎల్లమ్మ తల్లి నుదిటిన శివుడి మూడవకన్ను తరహాలో వేపాకు అవిశృతమవుతుంది...

అమ్మవారి ఆజ్ఞ రూపంలో వచ్చే వేపాకు చెడును సంహరిస్తుంది అనిపించేలా చివరి ఘట్టం ఉంది..!


పవర్ ఫుల్ పర్శీ పాత్రలో నటిస్తున్న దేవిశ్రీ ప్రసాద్ ముఖం మాత్రమే చివరిలో కనిపిస్తుంది...


ఒకరిపై ఒకరు దూసుకువస్తున్నట్లుగా కనిపించే ఇద్దరి మనుషుల చుట్టూ తిరిగిన వేపాకు చివరికి ఒక పెద్ద వేప చెట్టు వద్దకు వెళ్లి.. అక్కడ చెట్టుక్రింద వేళ దగ్గర వెలిగించి ఉన్న దీపాన్ని దాటుకుంటూ అక్కడే సమీపంలో ఉన్న బండారాయిపై అటు వైపు తిరిగి కూర్చున్న పర్షీ వద్దకు వెళ్లి ఆగిపోతుంది..!

ఇక పర్శీ మాత్రం భుజానికి తగిలించుకున్న డప్పు వెనకవైపు వేసి ఉండగా ఒళ్లంతా రక్తం ఒడుకుతున్నట్లుగా ఆవేశం ఆవేదన పూర్వక వదనంతో బండారాయిపై కూర్చుని ఉంటాడు..


సాయంత్రం కాస్త పొద్దు గుంకుతున్న సమయంలో వర్షం కురిసి వెలిసిన తర్వాత చెట్ల ఆకులపై ఉండే వర్షం నీరు ఇంకా వర్షం కురుస్తూనే ఉందన్నట్లుగా నీటి బిందువులుగా నేలపై పడుతుంటే నేల చిత్తడి చిత్తడిగా ఎలా కనిపిస్తుందో అలాంటి దృశ్యం కనిపిస్తుంది చివరన...

ఇక మధ్య మధ్యలో అమ్మవారి ఆజ్ఞను అనుసరిస్తున్నట్లుగా పొట్టేల్ కూడా ఒక విధమైన రౌద్రాన్ని ప్రదర్శిస్తుంది..


పర్శీ.. వేపాకు.. పొట్టేల్.. మొత్తంగా సినిమా కాన్సెప్ట్ ను ఆవిష్కరించినట్లుగా వీడియో దృశ్యాలు ఉన్నాయి....


శ్యామ్ కాసర్ల లిరిక్స్.. దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ లో రుద్ర సాంగ్ అదిరిపోయింది అనిపిస్తుంది...

కానీ కొన్ని చోట్ల దేవిశ్రీ తన పుష్పా2 లోని అమ్మోరుతల్లి సాంగ్ మ్యూజిక్ ను రిపీట్ చేసినట్లుగా అనిపిస్తోంది...

.......

A Report By

ShyamaSundar Akula

Comments


© Copyrights Reserved 2026 By NewSense News | Designed & Developed by Panchayithi.com 

bottom of page