top of page

పదవికోసం కన్న బిడ్డ ఉసురు తీసాడు..!

  • Writer: Writer Desk
    Writer Desk
  • Feb 3
  • 2 min read

కంటికి రెప్పలా కాపాడాల్సిన తండ్రి కాలయముడిగా మారిపోతున్న పరిస్థితులు దాపురించాయి...


పదవుల కాంక్ష మనిషిలోని రాక్షసుడిని తట్టిలేపుతోంది..


వస్తుందో రాదో తెలియని చిన్న పదవి కోసం కన్నబిడ్డనే కడతేర్చేంత దారుణానికి తలపడిన ఒక ఉన్మాద మనిషి.. సొంత బిడ్డని ఘోరంగా మట్టుబెట్టాడు...


మహారాష్ట్రలో చోటుచేసుకున్న ఈ హేయమైన ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది.. అంతకుమించిన ఆందోళన ఆవేదన కూడా కలిగిస్తోంది..!


ఇలాంటి దుర్మార్గులకుహంతకులకు భూమి మీద బ్రతికే హక్కులేదని.. ఉరితీయాలంటూ ప్రజల నుండి డిమాండ్లు వినిపిస్తున్నాయి..!

••••••

గ్రామ పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేయాలనే రాజకీయ ఆశతో, కన్న కూతురినే కడతేర్చాడో కసాయి తండ్రి. ప్రస్తుత సర్పంచ్‌ ఇచ్చిన సలహాతో ఈ దారుణానికి ఒడిగట్టాడు. ఈ ఘోర ఘటన మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లాలో చోటుచేసుకుంది.


వివరాల్లోకి వెళితే, నాందేడ్ జిల్లా ముక్కెడ్ తాలూకా కేరూర్ గ్రామానికి చెందిన పాండురంగ కొండ్‌మంగళే (28) బార్బర్ షాప్ నడుపుతున్నాడు. అతనికి ఒక కుమారుడు, ఆరేళ్ల వయసున్న కవల కుమార్తెలు ఉన్నారు. ఈ ఏడాది జూన్‌లో జరగనున్న గ్రామ పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేయాలని పాండురంగ ఆశపడ్డాడు. అయితే, మహారాష్ట్ర పంచాయతీ రాజ్ చట్టం ప్రకారం.. ఇద్దరి కంటే ఎక్కువ పిల్లలు ఉన్నవారు ఎన్నికల్లో పోటీచేయడానికి అనర్హులు..!


ఈ నిబంధన పాప పాలిట మృత్యువుగా పరిణమించింది.. మూడో సంతానంగా ఉన్న తన కూతురు ప్రాచిని అడ్డు తొలగించుకోవాలనే అత్యంత నీచ నికృష్టమైన ఆలోచన చేశాడు..! నిజానికి ఈ దుర్మార్గపు సలహా ఇచ్చింది ప్రస్తుత గ్రామ సర్పంచ్ గణేష్ షిండే..! పాండురంగకు గణేష్ కు మధ్య స్నేహం ఉంది..! దీంతో స్నేహితుడికి అత్యంత దుష్టపూరిత ఆలోచనను నూరిపోసిన షిండే.. పాప ఉసురు తీయడంలో కీలకపాత్ర పోషించాడు..


స్నేహితుడి సలహాతో ముందూ వెనకా ఆలోచించకుండ ఉన్మాదిగా మారిన పాండురంగ.. అనుకున్నట్లుగానే దారుణానికి ఒడిగట్టాడు..! కూతురు ప్రాచిని బైక్‌పై తెలంగాణలోని నిజామాబాద్ జిల్లాకు తీసుకెళ్లాడు. అక్కడ నిజాంసాగర్ కాలువలో చిన్నారిని తోసేసి.. మునిగి చనిపోయిందని నిర్ధారణ వచ్చేవరకు అక్కడే ఉండి.. అక్కడి నుండి వెళ్ళిపోయాడు..


నీళ్లలో మునిగిపోతూ.. బిడ్డ రక్షించమని భయంతో అరుస్తున్నా.. ఆ పాషాణ హృదయం కరగలేదు.. కళ్ళముందే కన్నబిడ్డ జీవం తీస్తూ రాక్షసానందం పొందాడు..!


కాలువలో బాలిక మృతదేహం లభించడంతో ముందుగా అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసిన నిజామాబాద్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సౌ చైతన్య నేతృత్వంలోని బృందం పాండురంగను విచారించగా, మొదట అతను పొంతనలేని సమాధానాలు చెప్పాడు. పోలీసులు తమదైన శైలిలో విచారించడంతో అసలు నిజాన్ని ఒప్పుకున్నాడు... బిడ్డను తానే చంపేశారని చెప్పాడు..!



పాపను దత్తత ఇవ్వాలని.. ఎక్కడైనా వదిలేసి రావాలని.. రకరకాల ఆలోచన చేసినా.. చివరికి చంపేయడమే మంచిదనే దుర్మార్గపు నిర్ణయానికి వచ్చాడు..! కన్నతండ్రి.. ప్రస్తుత సర్పంచ్ కలిసి చేసిన ఈ ఉన్మాద ఆలోచన పాప ఉసురు తీసేందుకు కారణం అయిందని కమిషనర్ సౌ చైతన్య తెలిపారు. పాండురంగ ఇచ్చిన సమాచారంతో, అతనికి సలహా ఇచ్చిన సర్పంచ్ గణేష్ షిండేను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. ఇద్దరిపై హత్య, నేరపూరిత కుట్ర కింద కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర సంచలనం రేపింది.


•••••••

Comments


© Copyrights Reserved 2024 By NewSense News | Designed & Developed by Panchayithi.com 

bottom of page