
ఆర్థికమంత్రి ఫోటోతో కేటుగాళ్ల మాయ..!
- Writer Desk

- Sep 16, 2025
- 2 min read
కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ ఫోటో చూపించి లక్షలు కొల్లగొట్టారు..!
హైదరాబాద్ లో సైబర్ చీటింగ్..!
హైదరాబాద్ : రకరకాల వ్యూహాలతో బురిడీ కొట్టిస్తున్న సైబర్ చీటర్స్ అమాయక ప్రజలనుండి కోట్లు కొల్లగొడుతున్నారు..!
ఫేస్ బుక్, వాట్సాప్ , టెలిగ్రామ్ ఇన్స్టాగ్రామ్ ఆన్ లైన్ లో ట్రేడింగ్, బ్యాంకింగ్, నిత్యావసరాల కొనుగోళ్లు, ఇతరత్ర ఆన్ లైన్ లావాదేవీలు నిర్వహించే వారిని ఎక్కువగా టార్గెట్ చేస్తున్నారు..!
విద్యావంతులు రిటైర్డ్ ఉద్యోగులు, గృహిణులు కూడా సైబర్ మోసగాళ్ల బారిన పడి కష్టపడి సంపాదించింది కోల్పోతున్నారు.!
ప్రజల లైఫ్ స్టైల్ ను అంచనావేస్తూ మొత్తం ఫోన్ నంబర్లు వృత్తి వ్యాపారాల వివరాలు పూర్తిగా తెలుసుకుంటున్న కేటుగాళ్లు.. పక్కా ప్లాన్ తో వలవిసురుతున్నారు..!

టార్గెట్ చేసేవ్యక్తులను వారి వయసును బట్టి ఎలా వల వేయాలో కూడా ప్లాన్ చేసుకుంటున్నారు. వృద్ధులకు వలపు వల విసురుతున్నారు. ముఖ్యంగా పదవీ విరమణ చేసి సంపాదించిన డబ్బులతో కాలం గడుపుతూ..టైమ్ పాస్ కోసం స్మార్ట్ ఫోన్ చూసే వృద్ధులను సులువుగా బురిడీ కొట్టిస్తున్నారు..! వాళ్ళకి ఏదో ఒక ఆశ చూపించి రెట్టింపు డబ్బులు వస్తాయి పెట్టుబడులకు అంటూ ఆకర్షించి.. తర్వాత వారిని భయపెట్టి లక్షలు లాగేస్తున్నారు.
సహజంగా వృద్ధులకు వారి కాల పరిస్థితులను బట్టి ఎక్కువగా సంప్రదాయ ప్రభుత్వ పాలనా విధానాలు నిబంధనలు పాటించిన అలవాటు ఉంటుంది. మంత్రులుగా ఉండే వ్యక్తులు రిజర్వ్ బ్యాంక్ ఇన్కమ్ ట్యాక్స్ తదితర ప్రభుత్వ విభాగాల అధిపతులు చెబుతున్నట్లుగా ఏవైనా వీడియోలు.. సమాచారం కనిపిస్తే సులువుగా నమ్మేస్తుంటారు. సైబర్ చీటింగ్, ఫోటోలు మార్పింగ్ చేయడం తదితర విషయాలపై సీనియర్ సిటిజన్స్ కు పెద్దగా అవగాహన ఉండదు..
ఇపుడు ఇదే కేటుగాళ్లకు వరంగా మారింది. ఏదో ఒక ప్రభుత్వ అధికారిగా నమ్మించి సులువుగా వృద్ధులను బుట్టలో పడేస్తున్నారు. అందినకాడికి దోచేస్తున్నారు. ఇలాంటి చీటింగ్ ఘటనలు నగరంలో నిత్యకృత్యంగా మారాయి.!

తాజాగా కేటుగాళ్లు ఏకంగా కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ఫోటోతో ఓ వృద్ధుడిని బురిడీ కొట్టించి లక్షలు కాజేశారు..
ఆన్ లైన్ ఇన్వెస్ట్మెంట్ లో పెద్దమొత్తంలో లాభాలు వస్తాయని.. ఆ విషయం నిర్మలా సీతారామన్ చెబుతున్నట్లుగా సోషల్ మీడియాలో కనిపించడంతో నమ్మి మోసపోయిన వృద్ధుడు పదిహేను లక్షల దాకా పోగొట్టుకున్నాడు.
హైదరాబాద్ సిసిఎస్ సైబర్ క్రైమ్స్ లో బాధితుడు ఫిర్యాదు చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. సంతోష్ నగర్ కు చెందిన 68 ఏళ్ల వృద్ధుడు టైమ్ పాస్ కోసం అపుడపుడు ఫేస్ బుక్ చూస్తుంటాడు. గత జూన్ నెలలో ఫేస్ బుక్ లో నిర్మలా సీతారామన్ డీపీతో ఉన్న ఒక పోస్టింగ్ కనిపించడంతో అందులో ఉన్న విషయం చదివాడు. ఆన్ లైన్ ఇన్వెస్ట్మెంట్ ద్వారా ఎవరి ప్రమేయం లేకుండా ఎక్కడికీ వెళ్లకుండా పెట్టుబడులకు రెట్టింపు మొత్తంలో లాభాలు సంపాదించవచ్చని, ఇది నా ప్రామిస్ అంటూ నిర్మలా సీతారామన్ చెప్పినట్లుగానే అందులో మ్యాటర్ కనిపించింది. అది నిజమేనని నమ్మిన వృద్ధుడు అందులో ఉన్న లింక్ ను క్లిక్ చేశాడు. వెంటనే ఫైనాన్స్ శాఖ అధికారులమన్నట్లుగా కలరింగ్ ఇస్తూ లైన్ లోకి వచ్చిన కేటుగాళ్లు వృద్ధుడిని మభ్యపెట్టి పలు విడతలుగా మొత్తం రూ.14.30 లక్షలు తమ ఖాతాల్లోకి డిపాజిట్.చేయించుకున్నారు. వృద్ధుడిని నమ్మించేందుకు.. అతని పెట్టుబడికి తక్కువ సమయంలోనే పెద్దమొత్తంలో లాభాలు వచ్చినట్లుగా ఆన్ లైన్ లో గణాంకాలు చూపించారు. ఇంకా ఇంకా డిపాజిట్ చేయాలని వృద్ధుడిపై కేటుగాళ్లు ఒత్తిడి తీసుకొచ్చారు. అయితే తన వద్ద ఇంక డబ్బులేదని, తనకు వచ్చిన లాభాలతో కలిపి మొత్తం డబ్బు ఇవ్వాలని, అవి ఇస్తే మళ్ళీ.పెట్టుబడి పెడతానంటూ వృద్ధుడు వారికి బదులిచ్చాడు. అలా కుదరదని చెప్పిన కేటుగాళ్లు ఇన్కం ట్యాక్స్ నిబంధనల ప్రకారం.. పెట్టుబడి, లాభాలకు కలిపి ఎనిమిది లక్షలు ట్యాక్స్ ముందుగా చెల్లిస్తేనే.. మొత్తం డబ్బు రిలీజ్ అవుతుందని నమ్మబలికారు. దీంతో అనుమానించిన వృద్ధుడు తన డబ్బు తనకు ఇవ్వాలని నిలదీశాడు. దీంతో కేటుగాళ్లు ఫోన్ స్విచ్ ఆఫ్ చేయడంతో పాటు.. వృద్ధుడికి పంపించిన ఆన్ లైన్ లింక్ లు ఓపెన్ కాకుండా చేసారు. దీంతో వృద్ధుడు హైదరాబాద్ సైబర్ క్రైమ్స్ లో ఫిర్యాదు చేశాడు.

మంత్రి నిర్మలా సీతారామన్ కార్యాలయం.. ఫైనాన్స్ సెక్రటరీ అంటూ కేటుగాళ్లు తనను తప్పుదోవ పెట్టించారని ఫిర్యాదులో తెలిపాడు.
.....




Comments