top of page

ప్రాణం తీసిన మామిడి పండు..!

Writer: Writer Desk
Writer Desk
Jun 11
2 min read

హైదరాబాస్ : మామిడి పండ్లు తిని అనుమానాస్పద స్థితిలో ఇద్దరు అక్కచెల్లెళ్ళు మృతి చెందిన ఘటన నారాయణగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. సోమవారం అక్క అయిన భువనేశ్వరి(17) మృతి చెందగా , మంగళవారం చెల్లెలు అయిన సంధ్య(10) చికిత్స పొందుతూ మృతి చెందింది. నారాయణగూడ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం కర్ణాటక రాష్ట్రంలోని బీదర్ ప్రాంతానికి వైజినాథ్, ఇందుమతి దంపతులు జీవనోపాధి కోసం నగరానికి వచ్చి విఠల్ వాడిలో నివాసం ఉంటున్నారు.



ఇటీవల వారి బంధువైన రేణుక వీరి ఇంటికి వస్తున్న క్రమంలో నారాయణగూడలోని జలమండలి సమీపంలో కొనుగోలు చేసిన మామిడి పండ్లను తల్లి ఇందుమంతితో పాటు నలుగురు కుమార్తెలు తిన్నారు. ఆదివారం సాయంత్రం మామిడిపండ్లు తిన్న ఐదుగురికి వాంతులు, విరేచనాలు మొదలు కావడంతో కాచిగూడలోని ఓ ప్రైవేట్ దవాఖానకు చికిత్స నిమిత్తం వెళ్లారు. వైజినాథ్ మూడో కుమార్తె భువనేశ్వరి(17) సోమవారం దవాఖానలో చికిత్స పొందుతూ మృతి చెందగా, మంగళవారం భువనేశ్వరి సోదరి సంధ్య కూడా మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు.



సంధ్య మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా దవాఖానకు తరలించారు. మృతురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. తల్లితో పాటు మరో ఇద్దరు కుమార్తెలు చికిత్స పొందుతున్నట్లు పోలీసులు తెలిపారు.


రసాయనాలే కారణమా..?

నగరంలో మామిడి కాయలు త్వరగా పక్వానికి రావడానికి పండ్లుగా మారడానికి విచ్చలవిడిగా రసాయనాలు వినియోగిస్తున్నారు..! ఫుడ్ సేఫ్టీ అధికారుల నిర్లక్ష్యం వల్ల ఫ్రూట్ మార్కెట్ వద్ద రిటైల్ మార్కెట్ కు రావడానికి ముందే రసాయనాలు కలుపుతున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి..!


అధికారులు నామ్ కే వాస్తగా తనిఖీలు చేసి చేతులు దులుపుకుంటుండగా.. రసాయనాలు కలపడం మాత్రం వ్యాపారులు ఆపట్లేదని.. అందువల్లే పండ్లు విషతుల్యంగా మారుతున్నాయని నగరవాసులు ఆరోపిస్తున్నారు..!


రెండు మూడు రోజులకంటే ఎక్కువ రోజుకు నిల్వ చేయలేని స్థితిలోనే పండ్లు ఉంటున్నాయని.. తాము మాత్రం ఎలాంటి రసాయనాలు కలపట్లేదని పండ్ల దుకాణదారులు చెబుతున్నారు..!


ఒక్క మామిడి పండే కాదు.. అన్ని పండ్ల విషయంలో ఇలా త్వరగా పక్వానికి రావడానికి రసాయనాలు కలిపి మక్కబెడుతున్నారనేది బహిరంగ రహస్యమే..!



కారణం వేరే ఉందా..?

ఈ ఘటనకు సంబంధించి పోలీసుకు వేరే కారణాలున్నట్లుగా అనుమానిస్తున్నారు..! కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తులో భాగంగా కుటుంబ సభ్యులను విచారించారు..! మామిడి పండ్లు మాత్రమే కాదని వారు తిన్న ఇతర ఆహార పదార్థాల గురించి కూడా ఆరా తీశారు..! వారి అనారోగ్యానికి.. పిల్లలు ఇద్దరు మృతి చెందడానికి మామిడి పండ్లు మాత్రమే కారణం కాదని అనిపిస్తోందని నారాయణ గూడ సీఐ సైదేశ్వర్ చెప్పారు..! దర్యాప్తు పూర్తయ్యాక పూర్తి వివరాలు వెల్లడిస్తామని చెప్పారు..!


దర్యాప్తులో భాగంగా సేకరించిన ఫుడ్ ఫ్రూట్ శాంపిల్స్ ల్యాబ్ కి పంపించినట్లు తెలిసింది..! మొత్తంగా మామిడి పండ్లు తిని పిల్లలు మృత్యువాత పడటం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది..!


............


A Report By

Dayakar Shiga

99087 76389

Comments


© Copyrights Reserved 2026 By NewSense News | Designed & Developed by Panchayithi.com 

bottom of page