
ఇక్కడ కేసు.. అక్కడ వేటు..!
- Writer Desk

- 2 days ago
- 1 min read
హైదరాబాద్: రాజకీయ క్రీడలో ఓ పోలీసు ఇన్స్ పెక్టర్ బలిపశువుగా మారిపోయాడా..!
తాజాగా సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో జరిగిన ఇన్స్ పెక్టర్ బదిలీలను చూస్తే అదే అనుమానం వ్యక్తమవుతోంది..
ఈమధ్య కాలంలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తనయుడు హర్షా రెడ్డి నిర్వహిస్తున్న రాఘవ కన్స్ ట్రక్షన్ సంస్థపై భూ ఆక్రమణ దాడి దౌర్జన్యం కేసులు నమోదయ్యాయి...
ఘటన జరిగింది గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో కావడంతో బాధితుల ఫిర్యాదు మేరకు అక్టోబర్ 25 న ఒకసారి.. నవంబర్ 30 న మరోసారి కేసులు రిజిస్టర్ చేశారు...
మొదటి ఫిర్యాదులో అక్టోబర్ లో రిజిస్టర్ చేసిన ఎఫ్ఐఆర్ లో గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేసినట్లుగా పేర్కొన్నారు...
రెండవసారి నవంబర్ చివర్లో నమోదైన ఎఫ్ఐఆర్ లో మాత్రం.రాఘవ సంస్థ పేరు కూడా ఉంది..
దీంతో రాజకీయంగా దుమారం సృష్టించింది..
ఇటీవల ఇదే విషయంపై మంత్రి పొంగులేటి మీడియా సమావేశంలో లేవనెత్తగా ఆయన సమాధానం చెప్పలేక తడబడ్డారు..! అధికారాన్ని దుర్వినియోగం చేయలేదు కాబట్టే తమ సంస్థ మీద ఎఫ్ఐఆర్ నమోదైనా కూడా న్యాయబద్ధంగా విచారణ జరిపించి వాస్తవమేంటో తేలాలని జోక్యం చేసుకోలేదని.. చెప్పుకొచ్చారు...
అయితే మంత్రిగారు మీడియాతో మాట్లాడిన రెండుమూడు రోజులలోపే గచ్చిబౌలి స్టేషన్ హౌజ్ ఆఫీసర్ పై బదిలీ వేటు పడటం ఇక్కడ ప్రాధాన్యతను సంతరించుకుంది...!

మంత్రి ఒత్తిడితోనే సీఐని గచ్చిబౌలి లాంటి కీలక పోలీస్ స్టేషన్ నుండి బదిలీ చేస్తూ ప్రాధాన్యత లేని చోటుకు పంపించారనే ప్రచారం మొదలైంది..
నిజంగానే ఒక మంత్రికి చెందిన సంస్థపై ఒక సీఐ స్థాయి అధికారి కేసులు నమోదు చేయడం అంత సులువా..? ఉన్నతాధికారులకు సమాచారమివ్వకుండా.. వారి అనుమతి తీసుకోకుండానే ఆయనకు ఆయనే నిర్ణయం తీసుకున్నారని అనుకోగలమా..?
ఈ కోణంలో చూస్తే పై అధికారులు ఒకవిధంగా సీఐని బలి చేశారనే అభిప్రాయం పోలీస్ వర్గాల్లో వ్యక్తం అవుతోంది..

ముఖ్యమంత్రి హోమ్ మినిస్టర్ బాధ్యతలు నిర్వహిస్తున్న రాష్ట్రంలో ఎలాంటి రాజకీయ అంతర్గత వ్యూహం లేకుండానే మంత్రులపై.. వాళ్ళ సంస్థలపై కేసులు నమోదవుతున్నాయా..? నమోదైన కేసులపై లీకులు ఎవరిస్తున్నారు... పైనవాళ్ళను వదిలేసి సీఐలపై చర్యలు ఎందుకనే చర్చ పొలిటికల్.సర్కిల్ లో జోరుగా సాగుతోంది..!

ఇటీవలే ఉత్తమ సేవలు అందిస్తున్నందుకు గానూ అవార్డ్ కూడా అందుకున్న సీఐ మహమ్మద్ హబీబుల్లా అంతలోనే ప్రాధాన్యత లేని పోస్ట్ కు బదిలీ కావడం విశేషమే మరి..!
......









Comments