top of page

ఎవరూ ఏమీ కారు..!!

  • Writer: Writer Desk
    Writer Desk
  • 2 days ago
  • 2 min read

సినిమా రంగులలోకం అంతా మాయా ప్రపంచం...

టాలెంట్ ఉండి కాస్త పైకి వస్తే అందరూ ఆప్తులే..!


తల్లిదండ్రులను మించిన ప్రేమను చూపిస్తారు.. అయినవాళ్ళను మించిన ఆప్యాయతను కనబరుస్తారు..


మాట్లాడితే నా సొంత తమ్ముడు నా సొంత తల్లి.. తండ్రి.. చెల్లి అంటూ వేదికలపై ఎక్కడలేని ప్రేమ వర్షం కురిపిస్తుంటారు...


తేనె మాధుర్యం కూడా బలాదూర్ అనే స్థాయిలో తీయటి మాటలతో మాయా ప్రపంచంలోకి తీసుకువెళతారు... వీళ్ళకి మించిన కుటుంబం లేదు.. వీళ్ళకి మించిన బంధాలు లేవు. స్నేహితులు లేరు ఆప్తులు లేరు అనే స్థాయిలో మైమరిపిస్తారు..!



ఒక్కసారి కర్మ కాలిందా..! అప్పటిదాక తమ నట కౌశల్యంతో మీపై అంతులేని ప్రేమను కురిపించిన వాళ్ళే.. అసలు మీరెవరో తెలియదన్నట్లుగా ప్రవర్తన మొదలు పెడతారు.. బిజీగా ఉంది కలవలేక పోతున్నమంటారు.. ఫోన్లు ఎత్తరు.. మాట్లాడరు.. ఎదురుగా వస్తున్నా... చూడనట్లుగా మొఖం తిప్పుకుని వెళ్తుంటారు..!


నిజంగా ఒక సినిమా రంగమే కాదు..! సమాజంలో అంతటా ఇలానే ఉంది.. కాకపోతే సినిమా రంగంలో మోతాదుకు మించి కనిపిస్తుంది..


తాజాగా ఇద్దరు ప్రముఖులు ఇలాంటి పరిస్థితిని కళ్ళారా చూసారు...!


ఒకరు టాలివుడ్ ప్రముఖ దర్శకుడు పూరి జగన్నాథ్..!


రెండవ వారు బాలీవుడ్ పాపులర్ కమెడియన్ రాజ్ పాల్ యాదవ్...


సొంతంగా సినిమాలు తీసి పూరి జగన్నాథ్ చేతులు కాల్చుకోగా.. కామెడీ పాత్రలతో హిందీ ప్రేక్షకులను ఎంతో ఆకట్టుకున్న రాజ్ పాల్.. ఓ సినిమాను తన దర్శకత్వంలోనే సొంతంగా నిర్మించి ఉన్న డబ్బులు పోగొట్టుకుని అప్పులపాలయ్యాడు...!


నిజంగా వీరిద్దరి గురించి చెప్పాలంటే చాలా ఉంటుంది...


ఒక్కొకరిదీ ఒక్కో స్టోరీ.. కానీ అవన్నీ తర్వాత మాట్లాడుకుందాం..! రాజ్ పాల్ విషయంలో ఏం.జరిగింది తెలుసుకుందాం..!

ఒక సినిమాకు దర్శకత్వం వహిస్తూ సొంతంగా తానే నిర్మించాడు రాజ్ పాల్.. ఆ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఘోర పరాజయం మూటగట్టుకుంది. దీంతో ఆర్థికంగా తీవ్రంగా నష్టపోయాడు రాజ్ పాల్..! రుణదాతల వెంటపడటంతో వారికీ తన ఆస్తులు అమ్మేసి ఏదోవిధంగా చెల్లింపులు చేస్తూ వచ్చాడు.. అయితే ఆస్తులు అమ్మినా రుణాలు కట్టడానికి సరిపోలేదు.. సమయం.ఇవ్వడానికి వాళ్ళు ఒప్పుకోలేదు..


రుణదాతల తాను ఇచ్చిన చెక్కులు బౌన్స్ కావడంతో వారు రాజ్ పాల్ పై కేసు పెట్టారు దీంతో అతన్ని పోలీసులు అరెస్ట్ చేసి తీహార్ జైలుకు తరలించారు.. ఈ సందర్భంగా రాజ్ పాల్ ఎంతో ఆవేదనతో దుఃఖిస్తూ చేసిన వ్యాఖ్యలు బాలీవుడ్ ను కుదిపేస్తున్నాయి.. అందరినీ కంట తడి పెట్టిస్తున్నాయి..


నేను నిజంగా అప్పులు తీర్చే స్థితిలో లేను.. ఇక్కడ నాకు స్నేహితులు అనేవారు లేరు.. నేను ఒంటరిని.. ఈ విపత్కర పరిస్థితి నుండి నాకు నేనుగా బయటకు రావాల్సి ఉంది.. అంటూ ఆయన కన్నీటి పర్యంతమవుతూ చెందిన వ్యాఖ్యలు అందరినీ కదిలిస్తున్నాయి..!

.........


జరిగింది ఇదే..!

2010లో రాజ్ పాల్ యాదవ్ దర్శకత్వం వహించిన ‘అతా పతా లాపతా' సినిమా నిర్మాణంతో ఈ వివాదం మొదలైంది. ఆ చిత్ర నిర్మాణం కోసం ఆయన ఢిల్లీకి చెందిన మురళీ ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ నుంచి రూ.5 కోట్ల రుణం తీసుకున్నారు. అయితే ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద ఘోరంగా విఫలమవడంతో రాజ్ పాల్ ఆర్థికంగా చితికిపోయారు. అప్పు తీర్చడానికి ఆయన ఇచ్చిన చెక్కులు బ్యాంకులో బౌన్స్ అవ్వడంతో బాధితులు కోర్టును ఆశ్రయించగా.. దీనిపై విచారణ జరిపిన మెజిస్ట్రేట్ కోర్టు 2018లోనే ఆయనకు ఆరు నెలల జైలు శిక్ష విధించింది.


దీనిపై ఆయన ఎన్నోసార్లు అప్పీలు చేసినా ఫలితం లేకపోయింది. వడ్డీతో కలిపి ఆ అప్పు ఇప్పుడు దాదాపు రూ.తొమ్మిది కోట్లకు చేరినట్లు తెలుస్తుంది. అయితే ఈ ఏడాది ఫిబ్రవరిలో ఢిల్లీ హైకోర్టు ఆయన శిక్ష అమలుపై కొంత సమయం ఇవ్వాలని కోరినప్పటికీ నిరాకరించింది.. వెంటనే లొంగిపోవాలని ఆదేశించడంతో ఫిబ్రవరి 5న ఆయన జైలు అధికారుల ముందుకు వెళ్లారు. కోర్టులో ఆయన తరపు న్యాయవాది వాదిస్తూ.. రాజ్ పాల్ యాదవ్ ఇప్పటికే రూ.75 లక్షలు చెల్లించారని, మిగిలిన బకాయిల కోసం కొంత సమయం కావాలని కోరినప్పటికీ న్యాయస్థానం అంగీకరించలేదు. తెలుగు ప్రేక్షకులకు రవితేజ 'కిక్ 2' సినిమా ద్వారా సుపరిచితుడైన ఈ విలక్షణ నటుడు, కేవలం ఆర్థిక ఇబ్బందుల వల్లే నేడు తీహాడ్ జైలులో ఆరు నెలల శిక్ష అనుభవించాల్సి రావడం సినిమా ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది..!

.........

A Report By

ShyamaSundar Akula

9010746999

.........

Comments


© Copyrights Reserved 2024 By NewSense News | Designed & Developed by Panchayithi.com 

bottom of page