ఇక్కడ విజయ.. అక్కడ పద్మ..!
- Writer Desk
- 12 minutes ago
- 2 min read
తెలుగు రాష్ట్రాల్లో వారంలో చోటు చేసుకున్న రెండు ఘటనలు కన్నీళ్ళు తెప్పిస్తున్నాయి...
తీవ్రమైన మనోవేదనతో కుంగిపోయి.. టీనేజీలో ఉన్న ఇద్దరిపిల్లలను తీసుకెళ్లి రైలు కిందపడి ఆత్మహత్య చేసుకుంది సాఫ్ట్వేర్ ఉద్యోగి విజయశాంతి రెడ్డి..!
ప్రేమ పెళ్లి చేసుకుని బాధ్యత మరిచి ఊరునిండా అప్పులు చేసి వేధింపులకు గురిచేసిన భర్తతో వేగలేక ఇద్దరు బిడ్డలకు ఉరివేసి చంపేసింది పద్మ..!
ఒక ఘటన తెలంగాణలోని హైదరాబాద్ శివార్లలో చర్లపల్లిలో చోటు చేసుకోగా...
ఇంకో ఘటన తిరుపతి జిల్లా పుత్తూరులో జరిగింది..
పోయిన శనివారం జరిగిన చర్లపల్లి ఘటన తెలుగు రాష్ట్రాలు సహా దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించింది..
ఇంకా ఘటనపై చర్చ జరుగుతుండగానే.. ఈ శనివారం అదే తరహాలో మరో ఘటన చోటుచేసుకోవడం మరింత ఆందోళన కలిగిస్తోంది. .
అన్నీ ఉండి మానసిక సమస్యతో విజయారెడ్డి ఎదిగిన బిడ్డలతో సహా సూసైడ్ చేసుకోగా...
అన్నీ కోల్పోయి విరక్తిపుట్టి ఇద్దరు చిన్నారులు చంపేసి ఆత్మహత్య చేసుకుంది పద్మ..!
కారణాలు బలమైనవా బలహీనమైనవా అనే విషయం పక్కనబెడితే...
కన్నబిడ్డలను ఎలా తమవెంట తీసుకువెళ్లగలుగుతున్నారు... విరక్తిలోనుండి పుట్టుకొస్తున్న తెగింపు అంతలా ప్రభావం చూపుతుందా అనే ప్రశ్న ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది..
విజయారెడ్డి విషయంలో ఇద్దరు పిల్లలు ఇంటర్ చదువుతున్నారు..

వాళ్ళు అడ్డుకోగలిగితే తల్లిని సులువుగా అడ్డుకునే స్థాయిలో ఉన్నవాళ్లు.. తమ ప్రాణాలే కాదు.. తల్లి ప్రాణాలు కాపాడగలిగే ఏజ్ లో ఉన్నవాళ్ళు.. కానీ వాళ్లిద్దరినీ ఆమె ఎలా ఆత్మహత్యకు అంగీకరింప చేసింది... తనకు మానసిక సమస్య ఉంటే... పిల్లలు ఏంచేశారు.. ఆర్థికంగా బలంగా ఉన్న కుటుంబం కాబట్టి తాను పోయినా.. పిల్లలు ఎలాగోలా బ్రతికేస్తారు.. భర్త చూసుకుంటాడు అని ఎందుకు అనుకోలేకపోయింది..? ఇవన్నీ ఇప్పటికీ జవాబులేని ప్రశ్నలే..!
ఇక పద్మ విషయానికి వస్తే.. ఆమె డిగ్రీ స్నేహితుడు శివశంకర్ ను వివాహం చేసుకుంది.. ఇంట్లోవాళ్ళని కాదని పెళ్ళిచేసుకున్న పద్మ చివరికి అత్యంత దయనీయ స్థితిలో ఆత్మహత్య చేసుకుంది..
శివశంకర్ జులాయిగా తిరగడం.. తెలిసినవాళ్లందరి దగ్గర అప్పులు చేయడం తప్ప ఇంకేం చేసేవాడు కాదు.. పైగా ఇద్దరు ఆడపిల్లలతో ఎలాగోలా సతమతమవుతూ నెట్టుకొస్తున్న భార్యను వేధింపులకు గురిచేసేవాడు..
ఏళ్లకెళ్ళు అతనితో వేగలేక.. ఇటు అప్పులవాళ్ల ఒత్తిడి.. మరోవైపు పూట గడవని పరిస్థితి..! ఇవన్నీ చూసి తీవ్ర వేదనకు గురైన పద్మ.. ఇక తనవల్ల కాదని భావించింది.. అయినవాళ్ళను కాదని ప్రేమించి పెళ్లిచేసుకున్న పాపానికి అందరికీ దూరమపై అష్టకష్టాలు పడి చివరికి చావే శరణ్యమనుకుంది.. అంతే కాదు తాను వెళ్ళిపోతే తన ఇద్దరు బిడ్డల జీవితం ఆగమైపోతుందని భావించిన పద్మ.. గుండెను బండ చేసుకుని ఇద్దరి పిల్లలను ఇంట్లో ఉరివేసి చంపేసి.. తర్వాత తాను ఆత్మహత్య చేసుకుంది..

కంటతడి పెట్టిస్తున్న పద్మ సూసైడ్ నోట్..!
చనిపోవడానికి ముందు పద్మ రాసిన లేఖ అందరినీ కదలిస్తోంది..
ఒక భర్త ఎలా ఉండకూడదో అలా తన భర్త ఉన్నాడని.. బాధ్యత మరిచి అప్పులు చేసి బ్రతకడం ఎలా సాధ్యం అవుతుంది.. అలాంటప్పుడు పెళ్లి చేసుకోకూడదు.. ఇలాంటి వాళ్ళకి పెళ్లి చేసుకునే అర్హత లేదు అని ఆవేదన వ్యక్తం చేసింది..
ప్రేమించిన పాపానికి ఇంట్లోవాళ్లను కాదని ఇతన్ని పెళ్ళిచేసుకుని తప్పు చేశాను..
మళ్ళీ జన్మంటూ ఉంటే.. తల్లిదండ్రులు చూసిన వాళ్ళనే పెళ్ళిచేసుకుంటా అంటూ తన బాధను అక్షరరూపంలో వ్యక్తం చేసింది..
అంతేకాదు తనను పాప అంటూ ప్రేమగా పిలిచే తన అన్నయ్య. ఈ ప్రేమ పెళ్లివాళ్ళ దూరమయ్యాడని ఆవేదన వ్యక్తం చేస్తూ.. అన్నయ్యా..ఒకసారి పాప అంటూ పిలవ్వా అంటూ దీనంగా అర్థిస్తూ లేఖలో పద్మ పేర్కొన్న తీరు అందరినీ కంటతడి పెట్టిస్తోంది..
ముందు వెనుక ఆలోచించకుండా ప్రేమ పెళ్లిళ్లు చేసుకునే యువతకు ఇది ఒక హెచ్చరిక లాంటిదని.. తల్లిదండ్రులను కాదని పెళ్ళిచేసుకుని ముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించాలని అందరూ అభిప్రాయపడుతున్నారు..
మొత్తం మీద రెండు ఘటనలు తెలుగు రాష్ట్రాల్లో ప్రజలను ఆవేదనకు ఆందోళన గురి చేస్తున్నాయి..
మారుతున్న లైఫ్ స్టైల్.. చిన్న చిన్న కారణాలకు పెద్ద పెద్ద నిర్ణయాలు తీసుకుంటూ ప్రాణాలు తీసుకుంటున్నారా..?
నిజంగానే పిల్లలను చంపేసి తామూ చనిపోయేంత తీవ్ర పరిస్థితి ఉంటుందా.. ఉమ్మడికుంబ జీవనం లేకపోవడం వల్లే ఒంటరి తనం అనే మానసిక సమస్య ఎక్కువ అవుతోందా...
ఇంకా ఎన్నో ఎన్నో ప్రశ్నలను ఈ ఘటనలు లేవనెత్తుతున్నాయి..!





