
ఖేల్ ఖతం..! దండకారణ్యం ఖాళీ..!
- Writer Desk

- 5 hours ago
- 2 min read
దేశంలో మావోయిస్టు ప్రాబల్యానికి దాదాపుగా చెక్ పడినట్లే భావించాలి.. కేంద్ర హోమ్ శాఖ మంత్రి అమిత్ షా విధించిన డెడ్ లైన్ ఈ నెలాఖరుతో ముగుస్తుంది. అంటే.. కేవలం మిగిలింది మరో వారం రోజులు..!
ఇప్పటికే మావోయిస్టు చీఫ్ గా భావిస్తున్న తిప్పిరి తిరుపతి అలియాస్ దేవ్ జీ సహా కీలక నేతలు అందరూ లొంగిపోయారు..!
తెలంగాణ రాష్ట్రంలో మావోయిజం దాదాపుగా తుడిచిపెట్టుకుపోయింది.. అజ్ఞాతంలో ఉన్నవారు కూడా దాదాపుగా లొంగుబాటు సిద్ధమవుతున్నారు.. ఈ వారం రోజుల్లో కీలక పరిణామాలు చోటు చేసుకోనున్నట్లు తెలుస్తోంది..
మొత్తం మీద 31 మార్చి వరకు అమిత్ షా విధించిన డెడ్ లైన్ వరకు మొత్తంగా మావోయిస్టు నాయకత్వం లొంగిపోయినట్లుగానే భావించవచ్చు...

దశాబ్దాలపాటు మావోల దళపతిగా నాయకత్వం వహించి బలమైన ఉద్యమాన్ని నడిపించిన గణపతి అలియాస్ ముప్పాల లక్ష్మణ్ రావు అనారోగ్య కారణాల వల్ల విదేశాలకు వెళ్లిపోయారు.. ఆయన లొంగుబాటు పై ఇప్పటికే సమాచారం ఉంది.. బ్రతికి ఉన్న మావోయిస్టు నాయకులలో అత్యంత కీలకమైన నాయకుడు గణపతి కాబట్టి ఆయన లొంగుబాటును కేంద్రం ప్రత్యేకంగా పరిగణిస్తోంది. రెన్నేళ్ల క్రితం నుండి ఆయన పోలీసు అధికారులకు టచ్ లో వచ్చినప్పటికీ ఆయన లొంగుబాటును వాయిదా వేస్తూ వస్తున్నారు.. ఈ నెలాఖరుకు ఎలాగు డెడ్ లైన్ ఉంది కాబట్టి గణపతి లొంగుబాటు ను లాంఛనంగా చూపించి మావోయిస్టు శకానికి ముగింపు పలికినట్లుగా అమిత్ షా ప్రకటించే అవకాశముంది.. అయితే దీనిపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది.!

బస్తర్ దండకారణ్యం ఖాళీ..!
ప్రస్తుతం బస్తర్.. దండకారణ్యానికి కీలక నాయకుడు సున్నం చంద్రయ్య అలియాస్ పాపారావు అలియాస్ మంగు నాయకత్వం వహిస్తున్నారు..! మాడ్వి హిడ్మా తరహాలోనే స్పెషల్ ఆపరేషన్స్ లో పాపారావు సిద్ధహస్తుడని సమాచారం.. ప్లాన్ చేస్తే సక్సెస్ అవాల్సిందే అన్నట్లుగా పాపారావు యుద్ధ వ్యూహాలు ఉంటాయని దండకారణ్యంలో అందరికీ తెలిసిన విషయమే..!
గతంలో రెండు మూడు సార్లు పోలీసులకు చిక్కినట్లే చిక్కి తప్పించుకున్నాడు పాపారావు..! కొన్ని సందర్భాల్లో అజ్ఞాతంలో ఉన్న మావోయిస్టుల మానసిక స్థైర్యం దెబ్బ తీసే వ్యూహంలో బాగంగా పాపారావు ను ఎన్కౌంటర్ చేశామని కూడా భద్రతా బలగాలు ప్రకటించిన సందర్భాలు ఉన్నాయి..!
ప్రస్తుతం పాపారావు లొంగుబాటుపై స్పష్టమైన సమాచారం అందుతోంది.. ఆయన ఇప్పటికే పోలీసులకు టచ్ లోకి వచ్చినట్లుగా తెలుస్తోంది..!

పుట్టి పెరిగింది ఇక్కడే..!
ఛత్తీస్‌గఢ్‌లోని మావోయిస్టు ప్రభావిత ప్రాంతమైన సుక్మా జిల్లా నిమ్మలగూడెం పాపారావు స్వగ్రామం.. ఇది భద్రాద్రి జిల్లా చర్ల మండలం శివారులో 24 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. చిన్ననాటి నుండి మావోయిస్టులను చూస్తూ ఎదిగిన పాపారావు విద్యార్థి దశలోనే నాటి పీపుల్స్ వార్ కు అనుబంధంగా ఉన్న రాడికల్ స్టూడెంట్ యూనియన్ ( ఆర్ ఎస్ యూ) లో చేరి తర్వాత పూర్తిస్థాయి మిలిటెంట్ గా అజ్ఞాతంలోకి వెళ్ళిపోయాడు..! 58 ఏళ్ల పాపారావు తనకంటే చిన్నవాడైన మాడ్వి హిడ్మా యుద్ధ తంత్రాలను చూసి ముగ్డుడయ్యాడు.. హిడ్మా నుండి అనేక మెళుకువలు నేర్చుకుని దండకారణ్యంపై పట్టు సాధించాడు.. బస్తర్ దండకారణ్యం డివిజన్ కు నాయకత్వం వహిస్తూ కీలక నాయకుడిగా కొనసాగుతున్నాడు..! ఈయన లొంగుబాటుతో దండకారణ్యంలో మావోయిస్టు ప్రస్థానానికి తెర పడినట్లే అనే అభిప్రాయం వ్యక్తమవుతోంది..!
.....
A Report By
ShyamaSundar Akula
9010746999
......




Comments