top of page

పిల్లిపై ప్రేమ.. ఎంతపని చేసింది..!

  • Writer: Writer Desk
    Writer Desk
  • 5 days ago
  • 2 min read

మానవ సంబంధాలు చెదిరిపోతున్నాయి.. తోబుట్టువులు కన్నవాళ్ళు.. భార్యాభర్తలు స్నేహితులు.. ప్రత్యర్థులు శత్రువులు అనే తేడా లేకుండా చిన్న చిన్న కారణాలతో హత్యలకు దాడులకు పాల్పడుతున్న రోజులు చూస్తున్నాం..


కానీ అదే సమయంలో పెంపుడు జంతువుల మీద అంతులేని ప్రేమ వ్యామోహం పెంచుకుంటున్నారు.


ఉమ్మడి కుటుంబాలు తగ్గిపోవడం.. భార్యాభర్తలు ఒకరిద్దరు పిల్లలు ఉండే కుటుంబాలలో తల్లిదండ్రులు ఎవరి ఉద్యోగం వ్యాపారాల్లో వాళ్లు బిజీగా ఉండటం వల్ల ఇంట్లో సరిగా ఆలనా పాలనా చూసేవాళ్ళు లేక పిల్లలు కాస్త ఒంటరితనం ఫీల్ అవుతుంటారు.


ఎదిగిన పిల్లలు ఎక్కడో హాస్టళ్లలోనో.. వేరే చోట ఉద్యోగాలు చేస్తూనో దూరంగా ఉండటం వల్ల ఇంట్లో కాస్త ఒంటరిగా ఎక్కువగా గడిపేవాళ్ళు ఇంకోరకమైన న్యూనతతో బాధపడుతుంటారు...



కారణం ఏదైనా తమకు అంటూ ఒక తోడుగా ఉండేందుకో.. అవి ఉంటే ఇంట్లో సందడి ఉంటుంది అనే కారణం చేతనో.. చాలామంది జంతువులను పెంచుకుంటున్నారు..!


గతంలో శునకాలను మాత్రమే పెంచుకునే వాళ్ళు.. కానీ రాను రానూ పిల్లలను పెంచుకోవడం కూడా ఎక్కువైంది..


శునకాల మాదిరిగానే.. వివిధ దేశాలకు చెందిన పిల్లులు కూడా చిన్నగా అత్యంత ఆకర్షణీయమైన రూపు రేఖలు కలిగి ఉంటున్నాయి.. దీంతో పిల్లలపై కూడా పెట్ లవర్స్ ఆసక్తి చూపుతున్నారు..!


గతంలో ఉమ్మడి కుటుంబాలు ఎక్కువగా ఉండేవి కాబట్టి భద్రతా కారణాలు.. దొంగల భయంతో శునకాలను పెంచుకునేవారు...


వాటి ఆలనా పాలనా చూసేవాళ్ళు కానీ.. వాటి ఆవాసం మాత్రం ఇంటి బయటే ఉండేది..!


కానీ గత రెండు దశాబ్దాలుగా పెంపుడు జంతువులను పరిగణించే పద్ధతే మారిపోయింది.. ఇంటి బయట నుండి బెడ్రూమ్ వరకు వాటి స్థానం మారిపోయింది..


మనుషుల మాదిరే.. వారికి సీజనల్ గా వస్త్రాలు.. ఆహారం.. ఇతరత్ర సౌకర్యాలు ఏర్పాటు చేస్తున్నారు.. ఈ మధ్య అయితే జనాలు మరింత అతి చేస్తున్నారు.. ఇంట్లో పిల్లల కంటే ఎక్కువగా కుక్కలు పిల్లలకే అధిక ప్రాధాన్యం ఇస్తూ ప్రేమగా చూసుకుంటున్నారు..!


ఇక ఇపుడు ఈ స్థాయి కూడా దాటిపోయింది జనాల మానసిక స్థాయి.. పెంపుడు జంతువులు హఠాత్తుగా మృత్యువాత పడితే.. అది భరించలేక మానసికంగా కృంగి పోవడం..ఆత్మహత్యలకు పాల్పడటం చేస్తున్నారు...


ఆ మధ్య ఒక మహిళ పెంపుడు కుక్క మరణించిందనే బాధతో ఆత్మహత చేసుకుంది.. ఇంకో యువకుడు మానసికంగా కుంగిపోయి అనారోగ్యం పాలై ప్రాణాలు పోగొట్టుకున్నాడు.


తాజాగా నగరంలో ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది..


పెంపుడు పిల్లి మరణించిన విషయం తెలిసి తీవ్ర మనోవేదనకు గురైంది ఓ యువతి..!వెంటనే దోమల మందు తిని ఆత్మహత్యకు పాల్పడింది..!


మీర్ పేట్ లో చోటు చేసుకున్న ఘటన అందరినీ కలిచి వేస్తోంది..


మీర్ పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బడాంగ్ పేట్ వెంకటాద్రి నివాస్ లో నివసించే బీఎస్సీ స్టూడెంట్ హిమబిందు గత రెండేళ్లుగా ఒక పిల్లిని పెంచుకుంటోంది..!


అయితే కారణమేంటో తెలియదు కానీ నిన్న బుధవారం ఉదయం చూసేసరికి ఇంటిముందు డోర్ దగ్గర పిల్లి చనిపోయి కనిపించింది.. దీంతో అది చూసి షాక్ కు గురైన హిమబిందు ఏడ్చుకుంటూ లోపలికి వెళ్ళింది.. దోమల నియంత్రణ కోసం ఉపయోగించే టార్టాయిస్ ను ముక్కలుగా చేసి మింగేసింది..!



అది గమనించిన ఆమె తల్లి ఏమైంది ఏం తిన్నావ్ అని అడిగినా హిమబిందు చెప్పలేదు.. దీంతో అక్కడ మిగిలిపోయిన ముక్కలు కనిపించడంతో వెంటనే ఆమె ఇరుగుపొరుగు వారిని పిలిపించి చాంద్రాయణ గుట్ట లోని డీఆర్డీఓ హాస్పిటల్ కు తరలించింది.. అయితే అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.. దీంతో మృతురాలి కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా రోదిస్తున్నారు..!


తాము వద్దు వద్దు అని చెప్పినా పిల్లిని తెచ్చి పెంచుకుంది.. ఇపుడు అదే పిల్లి కోసం తన ప్రాణాలే తీసుకుంది అంటూ కుటుంబసభ్యులు తీవ్ర ఆవేదన చెందుతున్నారు..!


పెంపుడు జంతువులపై ప్రేమ ఉండటం సహజమే.. కానీ వాటి జీవిత కాలం తక్కువగా ఉంటుంది.. అలాంటి వాటికోసం ప్రాణాలు తీసుకునేంత వ్యామోహం మాత్రం మంచిది కాదని.. అలాంటి వారికి ముందుగానే కౌన్సిలింగ్ చేయించడం మంచిదని మానసిక నిపుణులు సూచిస్తున్నారు..!


••••••••••

A Report By

ShyamaSundar Akula

9010746999


........

Comments


© Copyrights Reserved 2024 By NewSense News | Designed & Developed by Panchayithi.com 

bottom of page