top of page

కోడలిని చంపించింది..! కొడుకును హంతకుడిని చేసింది..!

Writer: Writer Desk
Writer Desk
Mar 18
2 min read

తల్లీ సోదరుల మాటలు విని ఉన్మాదిగా మారి ప్రేమించి పెళ్లి చేసుకున్న వైష్ణవిని అత్యంత దారుణంగా హతమార్చాడు..


ముఖ్యంగా సొంత తల్లి పెట్టిన పోరు వాడిలో ఉన్న మానవత్వాన్ని చంపేసింది..! సొంత భార్య.. కడుపులో ఉన్న బిడ్డను కూడా చంపేసేలా చేసింది..!


పెళ్లై ఏడాది కూడా అవకముందే నాలుగు నెలల గర్భిణీగా ఉన్న భార్యపై రాక్షసంగా ప్రవర్తించాడు.. కత్తితో దాడి చేసి మెడ మీద చేతులు బిగించి ఊపిరాడకుండా చేసి.. భార్య గిలగిలా కొట్టుకుంటూ ప్రాణాలు విడుస్తుంటే.. కడుపులో పెరుగుతున్న బిడ్డ గుర్తుకు రాలేదువాడికి.. ఆమె చనిపోయింది అని నిర్ధారించుకున్న తర్వాత అక్కడినుండి పారిపోయాడు..!!


రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన యూట్యూబర్ వైష్ణవి హత్య కేసుకు సంబంధించి అదనపు కట్నం కోసమే భర్త హరిబాబు ఆమెను చంపేసినట్లుగా పోలీసులు నిర్ధారించారు.. తల్లి.. సోదరుల ఒత్తిడితోనే హంతకుడు భార్యను హతమార్చినట్లు నిందితుడు ఇచ్చిన వాంగ్మూలం ద్వారా పోలీసులు అసలు కారణాన్ని నిర్ధారించారు..



మెట్ పల్లి డీఎస్పీ రాములు తెలిపిన వివరాల ప్రకారం..


మొన్న సోమవారం అర్ధరాత్రి వైష్ణవిని కోరుట్ల పరిధిలోని మాదాపూర్ లో ఆమె ఇంట్లోనే చంపేసిన హరిబాబు.. ఆ వెంటనే పరారయ్యాడు.. ఉదయం విగత జీవిగా పడి ఉన్న వైష్ణవిని చూసిన కుటుంబ సభ్యులు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు.. కేసు నమోదు చేసిన పోలీసులు ..హరిబాబు ను కోరుట్ల శివారులో నిన్న రాత్రి అరెస్ట్ చేసి.. విచారణ అనంతరం ఈరోజు రిమాండ్ కు తరలించారు.. వైష్ణవి హత్యకు పరోక్ష కారణమైన హంతకుడి తల్లి లక్ష్మీ.. సోదరులు అశోక్, ఆనంద్ పై కూడా పోలీసులు కేసు నమోదు చేశారు.. అయితే వారు ముగ్గురు కూడా పరారీలో ఉన్నారని.. వెతుకుతున్నామని పోలీసులు తెలిపారు..



ఐదు లక్షలు.. రెండు గుంటల భూమి ఇచ్చారు..!

యూట్యూబ్ రీల్స్ తో స్థానికంగా కాస్త పాపులారిటీ సాధించిన వైష్ణవిని చూసి మనసుపడిన హరిబాబు ప్రేమిస్తున్నానని పెళ్లిచేసుకుంటానని వెంటపడ్డాడు.. ఇందుకు వైష్ణవి కూడా ఒకే చెప్పడంతో ఏడు నెలల క్రితం పెళ్ళిచేసుకున్నారు..! పెళ్ళి సమయంలో ఐదు లక్షల నగదు.. రెండు గుంటల భూమి కూడా వైష్ణవి కుటుంబం కట్నం కింద హరిబాబు కు రాసిచ్చింది..!

అయితే ఇది హరిబాబు తల్లికి నచ్చలేదు.. పెద్దగా ఆస్తిపాస్తులు లేని వైష్ణవితో పెళ్లి వద్దని చెప్పినప్పటికీ హరిబాబు వినలేదు.. దీంతో పెళ్లి తర్వాత నుండి వైష్ణవి ని హరిబాబు తల్లి లక్ష్మీ సూటిపోటి మాటలతో వేధించడం చేసేది.. ఈ క్రమంలో తల్లి మాటలు విని ఆమె మిగతా ఇద్దరు కుమారులు కూడా వైష్ణవిని వదిలించుకోవాలంటూ తమ్ముడు హరిబాబు పై ఒత్తిడి తీసుకువచ్చారు..!


ఈలోగా వైష్ణవి గర్భం దాల్చడంతో ఇక పిల్లలు పుట్టేవరకు వెయిట్ చేస్తే వదిలించుకోవడం ఇబ్బంది అని భావించిన లక్ష్మీ.. ఆమె కుమారులు.. హరిబాబు పై ఒత్తిడి మరింత ఒత్తిడి పెంచారు..! దీంతో సోమవారం సాయంత్రం పుట్టింట్లో ఉన్న వైష్ణవి దగ్గరికి వెళ్ళాడు.. రాత్రి పొద్దుపోయాక అమెతో గొడవకు దిగిన హరిబాబు ఆమెను ముందుగా కత్తితో పొడిచి తర్వాత ఆమె గొంతు నులిమి చంపేశాడు..ఇంట్లోవాళ్ళు మెలుకువగా ఉంటే చంపడం కుదరదని దురాలోచనతోనే పొద్దుపోయాక అందరూ పడుకున్న తర్వాత ఈ ఘాతుకానికి పాల్పడినట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు. !



యూట్యూబ్ వీడియోలకు మంచి స్పందన..!

పెళ్ళి తర్వాత యూట్యూబ్ చానెల్ పెట్టి హరిబాబు వైష్ణవి కలిసి వీడియోలు చేస్తున్నారు... తక్కువకాలంలోనే యాబై ఏడు వేల మంది ఛానెల్ ఫాలోవర్స్ రిజిస్టర్ అయ్యారు...! వైష్ణవి స్వగ్రామం కోరుట్ల పరిధిలోని మాదాపూర్ గ్రామం కాగా..హరిబాబుది కోరుట్ల కేంద్రంలోని అయ్యప్పగుట్ట ప్రాంతం..! స్థానిక అంశాలపై.. భాష యాస పై పట్టుతో వీరు చేసిన యూట్యూబ్ వీడియోలు అందరిని ఆకట్టుకుంటున్నాయి.. తమలో ఉన్న కళతో పాపులారిటీ సాధిస్తున్న సమయంలో తల్లి సోదరుల మాటలు విని హరిబాబు హంతకుడిగా మారాడని.. మంచి భవిష్యత్తును.. జీవితాన్ని చేతులారా నాశనంచేసుకున్నాడని స్థానికులు.. అతని స్నేహితులు అభిప్రాయపడుతున్నారు..


......

A Report By

ShyamaSundar Akula

9010746999


=============

@Vaishnavi

Comments


© Copyrights Reserved 2026 By NewSense News | Designed & Developed by Panchayithi.com 

bottom of page